పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి

పెద్దపల్లి సెప్టెంబర్ 22(జనం సాక్షి) పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని సదయ్య, కాసు నరేష్‌లకు చెందిన గొర్రెలను అన్నయ్యకుంట చెరువు సమీపంలో మేపుతుండగా అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో మందలోని 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.అకాలంగా సంభవించిన ఈ ఘటనతో గొర్రెల కాపరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ కళ్ల ముందే గొర్రెలు మృత్యువాత పడటంతో సదయ్య, నరేష్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. గొర్రెల పెంపకమే తమ జీవనాధారమని, ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల మృతితో తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడిందని, ప్రభుత్వం స్పందించి నష్టపోయిన గొర్రెల కాపరులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు.