ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ నివారణ


మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి
చర్లకోల శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతి వేడుకలు
జడ్చర్లలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభం
జడ్చర్ల, సెప్టెంబర్ 9 (జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోందని, వ్యాధి బారిన పడి బాధపడటం కంటే రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కీర్తిశేషులు శ్రీమతి చర్లకోల శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా తన స్వగ్రామమైన తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఆమె విగ్రహానికి కూతురు స్పూర్తి, కుమారుడు స్వరణ్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం జడ్చర్ల పట్టణంలోని గౌడ ఫంక్షన్ హాల్ లో శ్వేతారెడ్డి జ్ఞాపకార్థం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన వైద్య చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. నేటి కాలంలో ఆహార అలవాట్లు, మారిన జీవన శైలి వల్ల చాలామంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి వ్యాధిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఉచిత శిబిరం రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని, గురువారం కూడా పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడిస్తూ, జడ్చర్ల నియోజకవర్గంలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.



