అకాల వర్షం.. భారీనష్టం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :
అకాల వర్షం రైతన్నలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం గాలివాన, వడగల్లు పడటంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం భారీనష్టాన్నే తెచ్చిపెట్టాయి. శనివారం తెల్లవారగానే ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం వల్ల పెద్ద నష్టం సంభవించింది. ఖమ్మంజిల్లా భద్రాచలంలో  భారీ వర్షం అతలాకుతలం చేసింది. శనివారం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగాల్సి ఉండగా తెల్లవారుజామునే కురిసిన వానవల్ల భక్తులకు కొంత ఇబ్బంది కలిగింది. అయితే చుట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లో భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజంపేట, రాజానగర్‌, కాకినాడ పశ్చిమగోదావరి జిల్లా తణుకు, పాలకొల్లు, నర్సాపురం, విశాఖపట్నంలోని అరుకులోయల్లో ఈవర్షాల ప్రభావం తీవ్రంగానే ఉంది. నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలుల వల్ల విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. కోదాడ, తొగర్రాయిలలో విద్యుత్‌ వైర్లు పడిపోవడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. దీంతో స్థానికులు విద్యుత్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరు, నెన్నెల, కోటపల్లి, జైపూర్‌ మండలాల్లో కురిసిన అకాల వర్షాలు పెద్దఎత్తున పంటనష్టం తెచ్చిపెట్టాయి. జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. చాలాచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుకురువడంతో జనజీవనానికి తీవ్రఇబ్బందులు కలిగాయి. ఈదురు గాలులవల్ల విద్యుత్‌ స్థంబాలు విరిగిపడి పోయాయి.విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగిపడ్డాయి. ఇల్లు సైతం కూలిపోవడమేకాక, గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. నల్గొండ జిల్లాలో సైతం పెద్దఎత్తున నష్టాన్నే తెచ్చిపెట్టాయి. కోదాడ, తొగర్రాయిలలో ఈదురుగాలులకు విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో ఇద్దరు పదోతరగతి విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. చాలా చోట్ల రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వరిపంటలు పెద్దఎత్తున నేల కొరిగాయి. జీడిమామిడితోపాటు, మామిడి, బత్తాయి, నిమ్మతోటలు పూర్తిగా చెడిపోయాయి. నష్టం అంచనా వేసే పరిస్థితులు ఇప్పటికిప్పుడు లేకపో యినా సుమారు 5వేలఎకరాలకు పైగానే వరిపంటలు, సుమారు 10వేల మామిడి, నిమ్మ, బత్తాయిచెట్లు విరి గిపోయినట్లు రాష్ట్ర రాజదానికి అందిన సమాచారం మేరకు తెలుస్తోంది., అయితే ఇదిఇంకా పెరిగే అవకాశా లున్నాయని సమాచారం. వరుసగా రాష్ట్రంపై అకాల వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉక్కపోతగా ఉన్నవాతావరణంలో మార్పు వచ్చి చల్లబడగా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.  ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి పరిహారాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. చేతికాడికి వచ్చిన బుక్క కడుపులోకి పోకుండా జరిగిందని, దీనివల్ల చేసిన అప్పులు తీర్చుకునేది ఎలా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వస్వం కోల్పోయినందున ఉదారంగా సహాయం చేసి ఆదుకోవాలని లేనిపక్షంలో ఆత్మహత్యలు తప్ప మరో మార్గమేది లేకుండా పోతుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పంటసాగుకోసం అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడులు కూడా అందే పరిస్థితిలేక పోవడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తాము, తమకుటుంబ సభ్యులం ప్రాణాలు బలవంతంగా తీసుకోక తప్పదని అంటున్నారు.