అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 18(జనం సాక్షి)
తన భూమిలో అక్రమంగా ప్రహరీ నిర్మిస్తున్నారని దానిని అడ్డుకోవాలని కోరుతూ వరంగల్ నగరంలోని మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో బాధితుడు అన్నారపు రామరాజు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ సర్వే నెంబర్ 774లో పాలకుర్తి నాగరాజు అనే వ్యక్తి దగ్గర తాను ఆరు గుంటల భూమి ఏడాది క్రితం కొన్నానని, దీనికి సంబంధించిన కాగితాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. కానీ కొందరు వ్యక్తులు అక్రమంగా దౌర్జన్యంగా ఆ భూమిలో ప్రహరీ నిర్మిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారని, ఇదేంటని అడిగితే బెదిరిస్తున్నారని రామరాజు తెలిపారు. దొంగ కాగితాలు సృష్టించి తమ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు . అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు రామరాజు వివరించారు.