అక్రమ లేఅవుట్లపై జాబితా ఇవ్వండి అధికారులకు జేసీ ఆదేశం

శ్రీకాకుళం, జూలై 12: జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమ లేఅవుట్లపై యంత్రాంగం కొరడ ఝుళిపించనుంది. అక్రమ లే అవుట్లు, వాటిలో నిర్మించిన ఇళ్ల వివరాల జాబితాలను వారం రోజుల్లోగా తనకు అందజేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో పంచాయితీ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో ఆయన సమీక్షించారు. లేఅవుట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి కూలగొట్టాలని, నిబంధనలు అతిక్రమించే వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయకూడదని ఆయన పేర్కొన్నారు. బిల్డింగ్‌ ప్లాన్‌కు అన్ని అనుమతులు సక్రమంగా ఉంటేనే రుణం ఇవ్వాలన్నారు. అక్రమ లేఅవుట్లు అందులో ఉన్న భవనాల వివరాలను ప్రతి డివిజన్‌ నుండి ఇవ్వాలని ఆదేశించారు. లేఅవుట్లకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కొనరాదన్న విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. డివిజన్‌స్థాయిలో పంచాయితీ కార్యదర్శి, పంచాయితీ ప్రత్యేక అధికారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక భవిష్యత్‌లో అక్రమ లేఅవుట్లు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. గుర్తింపు పొందిన సర్వేయర్లు ఎంతమంది ఉన్నారో తనకు తెలియజేయాలని, అవసరమైతే మరికొంతమందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుందామన్నారు. డిఎల్‌ పిఓలు ప్రత్యేకంగా పర్యవేక్షించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ నూర్‌బాషాకాశిం, పంచాయితీ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ దామోదరరావు, డిఎల్‌ పిఓలు పి.సత్యనారాయణ, బి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.