అగస్టా కుంభకోణంలో త్యాగీకి సీబీఐ తాఖీదులు

న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) :
అగస్టా హెలీక్యాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ త్యాగితో పాటు ఆయన ముగ్గురు సోదరులు, మరో ఐదుగురికి సీబీఐ తాకీదులు అందజేసింది. అగస్టా వెస్ట్‌ల్యాడ్‌ నుంచి 3600 కోట్లతో 12 హెలీక్యాప్టర్లు కొనుగోలు చేశారు. 12 మంది వీవీఐపీలకు అత్యంత భద్రత కూడిన హెలీక్యాప్టర్ల కొనుగోలు చేయాలని కేంద్రం తలపెట్టింది. అయితే ఈ బిడ్డింగ్‌లో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ పాల్గొనేందుకు వీలుగా నిబంధనల్లో మార్పు తెచ్చేందుకు కంపెనీ ప్రతినిధులు యురోపియన్‌ మధ్యవర్తులు కార్లో గెరోసా, క్రిస్టియన్‌ మైఖేల్‌, హాస్కే  త్యాగి సోదరులు సంజీవ్‌, రాజీవ్‌, సందీప్‌తో సంప్రదింపులు జరిపారు. వారి ద్వారా త్యాగికి పెద్ద ఎత్తున ముడుపులు అందించి నిబంధనలు మార్చేశారు. ఫలితంగా భారీ మొత్తం మధ్యవర్తుల ద్వారా ఆయన సోదరులకు చేరినట్టు ఇటలీ ప్రభుత్వ విచారణ సంస్థ కొంతకాలం క్రితం బయటపెట్టింది. ప్రతిపక్షాల ఒత్తిడితో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ 12 మందిపై ఈ కుంభకోణంలో అభియోగాలు నమోదు చేసింది.