అగస్టా స్కాంపై విచారణకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ, మార్చి 1 (జనంసాక్షి) :
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం కేసులో జోక్యం చేసుకొనేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరిం చింది. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించ డమే కాకుండా దర్యాప్తును పర్యవేక్షించాలన్న ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జోక్యం చేసుకోబోమని చెబుతూనే.. ‘ఇది సరైన వేదిక కాదు. అది మా కర్తవ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. అది తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. రూ.3,600 కోట్ల హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం దక్కించుకొనేందుకు ఇటాలియన్‌ కంపెనీ ఫిన్‌మెకానికా దాదాపు రూ.360 కోట్ల మేర లంచాలు చెల్లించినట్లు ఇటలీ దర్యాప్తు అధికారులు ఇటీవల వెల్లడించారు. దీనికి సంబంధించి సంస్థ సీఈఓతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం బారత్‌లో సంచలనం సృష్టించింది. దీనిపై రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఎవరెవరికి లంచాలు ముట్టాయనే దానిపై సీబీఐ ఆరా తీస్తోంది. అయితే, ప్రత్యేక దర్యాప్తు సంస్థతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అయితే, అందుకు నిరాకరించిన ప్రభుత్వం పార్లమెంటరీ సంయుక్త సంఘంతో విచారణ జరిపించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు జేపీసీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపించాలని ఓ న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కుంభకోణం దర్యాప్తును పర్యవేక్షించాలని కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు కుంభకోణం దర్యాప్తులో జోక్యం చేసుకొనేందుకు నిరాకరించింది.