ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివే
` వనస్థలిపురం సమీపంలోని రూ.15వేల కోట్ల విలువైన భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15వేల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని సాహెబ్‌నగర్ వద్ద ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖదేనని తేల్చింది. దాదాపు 20 ఏళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతోంది. ఈ భూమిపై యాజమాన్య హక్కులు కోరుతూ నిజాం, సాలార్ జంగ్, మీరాలం వారసులమంటూ పలువురు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో పిటిషన్లు వేసిన 260 మందికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల ధర్మాసనం.. ఇది పూర్తిగా అటవీ భూమి అని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పు వెలువడిన 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రతిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని ధర్మాసనం ఆదేశించింది.
సెషన్స్ కోర్టులకు జీవితఖైదు విధించే అధికారం లేదు
` సుప్రీంకోర్టు
న్యూఢల్లీి(జనంసాక్షి):జీవితఖైదు శిక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. జీవితఖైదు విధించే అధికారం సెషన్స్ కోర్టులకు లేదని, కేవలం రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలకు మాత్రమే ఉందని పేర్కొంది. నిందితుడికి జీవిత ఖైదు విధించడం, శిక్ష తగ్గించే అధికారాలు సెషన్స్ కోర్టులకు లేవని జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.


