రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రాజకీయ కక్ష సాధింపు తోనే నేషనల్ హెరాల్డ్ కేసు వేయడం జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గూరువారం భూపాలపల్లి మంజూరునగర్ లోని బీజేపీ కార్యాలయం ముందు డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు సింగరేణి ఏరియా ఆసుపత్రి సెంటర్ నుండి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కొంతసేపు బీజేపీ ఆఫీస్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీబీఐ, ఈడి లను ఉపయోగించి కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని వేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఫిర్యాదును కోర్టు కొట్టివేసిందని, కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, ట్రాన్జక్షన్లు లేవని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఈడీ కేసు నమోదు చేసిందని, బీజేపీ ప్రభుత్వమే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను రాజకీయ ఆయుధాలుగా వాడుతోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ గానీ, అక్రమ ఆస్తులు గానీ లేవని, కోర్టు ఈడీకి చివాట్లు పెట్టి ఇలాంటి కేసులు పెట్టొద్దని హెచ్చరించిందన్నారు. స్వతంత్ర సంస్థలను పార్టీ ప్రయోజనాల కోసం వాడొద్దని స్పష్టమైన సందేశం ఇచ్చిందని, కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులతో ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈడీ చర్యల వెనుక బీజేపీ రాజకీయ దురాలోచన బయటపడిందని, ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2005లో ఉపాధి హామీ పథకం ప్రారంభం అయిందని, ఇప్పుడు పథకం పేరు మార్చి విక్సిత్ భారత్ – జీ రామ్ జీగా నామకరణం చేశారన్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆలోచనకు నిదర్శనమని, పథకాన్ని బలపర్చకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదలు, దళితులు, మైనారిటీల సంక్షేమాన్ని పట్టించుకోని వైఖరి కేంద్రానిదని మండిపడ్డారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాల మూలసూత్రాలను బీజేపీ చెరిపేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు.