ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..
ముగ్గురు మావోయిస్టుల మృతి
చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులను మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీకి చెందినవారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో మద్వి జోగ, సోది బండి, నుప్పో భజ్నీ ఉన్నారు. ఎస్పీ కిరణ్ చవాన్ ఈ ఘటనను ధ్రువీకరించారు. గొల్లపల్లి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే సమాచారం ఆధారంగా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. అటవీ పర్వత ప్రాంతాన్ని డీఆర్‌జీ సిబ్బంది చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు, అనేకమంది మావోయిస్టులు గాయపడినట్లు సమాచారం.


