అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

సమస్యలపై పోరాటం తప్పదు: సిపిఐ

ఖమ్మం,జూన్‌2(జ‌నం సాక్షి): ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భుములకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అటవీ భూమలుపై హక్కుఉలుండవని చెప్పడం వారిని వంచించడమే అవుతుందన్నారు. ఆదివాసీ గిరిజనులందరికీ అటవీ భుములపై హక్కు కల్పించాల్సిందిపోయి ముఖ్య మంత్రి కేసీఆర్‌ అడవిపై ఆదివాసీ గిరిజనులకు ఎలాంటి హక్కు లేదని చెప్పడంతో వరాఇలో ఆందోళన నెలకొంది. ఈ నాలుగేళ్ల సంబరాల్లో కనీసం వారిగురించి మాట్లాడకపోవడం దారుణమన్నారు. పోడు భూములను కాపాడుకునేందుకు పోడు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోడుభూమి సాగుదారులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దళితులకు మూడెకరాల భూమి, 3.5లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పట్టాలివ్వాలన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కుప్రకారం 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనుల భూములు, 1/70 వంటి చట్టాల విషయంలో మార్పుచేసే అధికారం ముఖ్యమంత్రికిగానీ మంత్రులకుగానీ లేదన్నారు. ఇదీ ముమ్మాటికీ గవర్నర్‌, రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుందన్నారు. అడవులే ఆధారంగా బతికే ఆదివాసీలకు దానిపై హక్కు లేకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. తరతరాలుగా పోడువ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు అటవీ భుములపై హక్కు కల్పించాలనే సదాశయంతో కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆ చట్టం ప్రకారం 2006కు ముందుగా అటవీ భుములు సాగుచేస్తున్న వారికి అధికారాలు దఖలుపడతాయని అన్నారు. ఇవన్నీ తెలిసీకూడా కేసీఆర్‌ తప్పుడు ప్రకటనలు చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హక్కులు కల్పించాలని లేనిపక్షంలో మరో ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు.