అట్టహాసంగా మిషన్‌ కాకతీయ

c

పలుగు పార తట్ట పట్టి మట్టిమనిషిగా కేసీఆర్‌

ప్రజాప్రతినిధులకు చెరువులే అడ్డా కావాలి

అవినీతి కాంట్రాక్టర్లను సహించం..సీఎం కేసీఆర్‌

నిజామాబాద్‌,మార్చి12(జనంసాక్షి): బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ చెరువులో సీఎం కేసీఆర్‌ మట్టి తవ్వి తట్టఎత్తి చెరువు పూడికతీతకు శ్రీకారం చుట్టారు. సిఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తట్టపట్టి చేయికలిపారు. చెరవుల పునరుద్ధరణకు ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రత్యేక హెలికాష్టర్‌లో సదాశివనగర్‌ పాత చెరువు వద్దకు చేరుకున్న సీఎం ముందుగా మిషన్‌ కాకతీయ పైలాన్‌ ఆవిష్కరించారు. అనంతరం రైతులతో కలిసి చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం వెయ్యేళ్ల తర్వాత జరుగుతోందన్నారు. తెలంగాణలో వెయ్యేళ్ల క్రితమే వాటర్‌ షెడ్‌ ల వ్యవస్థను కాకతీయ రెడ్డి రాజులు అమలు చేశారని కెసిఆర్‌ చెప్పారు. చెరువుల పునరుద్దరణ ఉద్యమంలా సాగాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు చెరువు వద్దే మకాం వేసి జలకళ వచ్చేలా పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ఈ మూడు నెలలు ఇదో ఉద్యమంగా సాగాలన్నారు. సదాశినగర్‌ చెరువుకు అయన అవసరమైన నిధుల విడుదలకు హావిూఇచ్చారు. వచ్చే ఏడాది వచ్చే సరికి ఈ చెరువు కట్టతో సహా అంతా కళకళ లాడాలన్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో కూడా చెరువులు ఎలా ధ్వంసం అయింది చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. నలభై ఆరువేల చెరువులు ఉన్నాయని,వీటన్నిటిలో పూడికలు పోవాలని, పంట కాల్వలు బాగుపడాలని,మొత్తం వ్యవస్థ మెరుగుపరిచితే కరవు అనేది ఉండదని అన్నారు. చెరువులలోని మట్టిని రైతులు తీసుకుని వెళ్లాలని కెసిఆర్‌ పిలుపు ఇచ్చారు. చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా చెరువుల బాగుచేత జరగాలని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు బూజు పెట్టిన విధానాలకే పరిమితం అని అన్నారు. చెరువుల రిపేర్లలో ఎక్కడా దొంగ కాంట్రాక్టర్లు పెట్టరాదని, ఎక్కడా అవకతవకలు జరగరాదని ఆయన అన్నారు. గతంలో అవకతవకలు చేసినవారిని గుర్తించి చర్య తీసుకోవాలని, వారికి అవకాశం ఇవ్వరాదని, ఇది గత ప్రభుత్వం కాదని, ఎక్కడా అక్రమాలకు అవకాశం ఇవ్వరాదని సిఎం జిల్లా అధికారులకు ఆదేవౄలు ఇచ్చారు. చెరువులోని పూడికను పొలాల్లో చల్లితే.. పంట దిగుబడి పెరుగుతుందని చెప్పారు. గతంలో రైతులు పంట దిగుబడి కోసం చెరువులోని పూడికను తీసుకెళ్లే వారని.. కానీ మార్కెట్లలో ఎరువులు లభ్యమవుతుండడంతో చెరువుల నుంచి మట్టిని తీసుకుపోవడం తగ్గిందని పేర్కొన్నారు. దీంతో చెరువుల్లో పూడిక భారీగా పేరుకుపోయిందన్నారు.  ఇదిలా వుంటే కాకతీయ రెడ్డి రాజుల కాలం నాడు చెరువులను ధ్వంసం చేయొద్దని శిలాశాసనాలు పెట్టారని సిఎం కెసిఆర్‌ గుర్తు చేశారు. చెరువులకు అధిక ప్రాధ్యాన్యత ఇచ్చారని తెలిపారు. నాడు చాలా యుద్ధాలు జరిగాయని.. అయితే శత్రువులు చెరువుల జోలికి వెళ్లలేదని పేర్కొన్నారు. కానీ 1956 లో తెలంగాణ.. ఎపి లో కలిసిన పుణ్యమా.. అని ఆంధ్ర రాజులు.. చెరువులను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవులు నాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాకతీయులు 80వేల చెరువులు తవ్వించారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. గతంలో ఎంతమంది రాజులు వచ్చినా చెరువులు నాశనం చేయలేదు… ఆంధ్రా పాలకులు వచ్చాక చెరువులన్నీ నాశనమయ్యాయన్నారు. 60 ఏళ్ల పాలనలో మన చెరువుల్లో అడుగుల మేర పూడిక ఏర్పడిందన్నారు. ఇక్కడి చెరువులు కళకళలాడేలా చేస్తానని ఉద్యమంలోనే చెప్పానని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 46వేల చెరువులు బాగుపడాలని మిషన్‌ కాకతీయ చేపట్టినట్లు వివరించారు. చెరువుల తవ్వకం పని ప్రభుత్వానిది… మట్టి తీసుకెళ్లే బాధ్యత రైతులది అని చెప్పారు. ప్రజాప్రతినిధులంతా చెరువులు, కుంటల వద్దే ఉండి పనులను పర్యవేక్షించాలని సూచించారు. చెరువు కట్లపై ఈతచెట్లు పెంచాలని సూచించారు. కట్ట కింద ఈత చెట్లు పెంచితే కట్ట బలంగా ఉంటది. పూడిక ఉండొద్దు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించాం. ఆన్‌లైన్‌లో ఓపెన్‌ టెండర్లు పిలుస్తున్నం. ఎవరైనా పనులను దక్కించుకోవచ్చు. నాసిరకం పనులు చేస్తే జైలుకు పోవడం ఖాయం. చెరువు మన కల్పతరువు. చెరువుల పునురద్ధరణ పవిత్ర యజ్ఞంలా భావించాలని సీఎం సూచించారు. నాలుగు రోజులైతే అసెంబ్లీ సమావేశాలు ముగుస్తయి. హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే కనబడొద్దు. ప్రజాప్రతినిధులు నేలవిడిచి సాము చేయొద్దు. ఎమ్మెల్యేలు, ఎంపీలంతా టెంట్ల కిందనే కూర్చుని చెరువు పనులు చూసుకోవాలె. రైతులతో పాటే ఉంటూ వారితో పాటే తినాలి. వచ్చే ఏడాది కల్లా పాత చెరువు జలకళను సంతరించుకోవాలి. ఎస్సారెస్పీ నుంచి ఎల్లారెడ్డికి నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనని సీఎం పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉద్యమ గెలిచించి.. తెలంగాణ వచ్చింది..

ద్యమం గెలిచించి.. తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమకాలంలో జైళ్లకు వెళ్లిన నేతలను ప్రజలు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను చేశారన్నారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకనుగుణంగా పాలన చేయాల్సిన అవసరముందని చెప్పారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ జవాబిచ్చారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆయన కాకతీయ మిషన్‌ ను ప్రారంభించిన కెసిఆర్‌ తన ప్రసంగంలో షబ్బీర్‌ ఎక్కడా కనబడడని ,సోనియాగాందీ ఇంటిలో ఉండి , ఎమ్మెల్సీ అయ్యారని , ఆయన ఫర్మానాలు ఇస్తున్నారని, ఇక్కడ జరుగుతున్న పనులు కనిపించడం లేదా అని కెసిఆర్‌ ప్రశ్నించారు. షబ్బీర్‌ ఇక్కడకు రా..చెరువులో తట్టలు మోయి అని ఆయన పిలుపు ఇచ్చారు. ఆసరా పదకం కింద డబ్బులు ఇవ్వడం లేదా?అంగన్‌ వాడీలకు జీతం పెంచడం లేదా?ఇలా ఆయా స్కీములు అమలు చేస్తున్న విషయం ఆయనకు కనిపించడం లేదా అని కెసిఆర్‌ అన్నారు. తాము పాత రాజకీయం చేయడం లేదని షబ్బీర్‌ అలీ గమనించాలని, సొల్లు పురాణాలు,వాగుడు బంద్‌ చేయాలని కెసిఆర్‌ అన్నారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ప్రస్తావన రావడంతో సీఎం ఈ విధంగా స్పందించారు.  మేం ఇప్పుడు పనిచేస్తం. ఐదేళ్ల తర్వాత మళ్లీ పాసవుతాం. సొల్లు వాగుడు మాని నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. మంచి పద్దతులలో ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. ఆకాశం విూద ఉమ్మితే విూవిూద పడుతుందని అన్నారు.సదాశివనగర్‌ పాతచెరువుకు మిషన్‌ కాకతీయలో భాగంగా కేటాయించిన నిధులతో పాటు సీఎం సహాయ నిధి నుంచి రూ. కోటి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 11 విద్యుత్‌ ఉపకేంద్రాలు

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 11 విద్యుత్‌ ఉపకేంద్రాలు మంజూరు చేస్తున్నట్లు  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని సదాశివనర్‌లో మిషన్‌ కాకతీయ పనులకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ… సదాశివనగర్‌ పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామన్నారు. దళితులు, గిరిజన యువతుల పెళ్లిళ్లకు రూ.51వేలు ఇస్తున్నామని తెలిపారు. తాడ్వాయిలో ఐటీఐ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి బీడీ కార్మికునికి ప్రభుత్వ సాయం అందుతుందని స్పష్టంచేశారు. 132 కేవీ సబ్‌స్టేషన్‌ మంజూరు. పదకొండు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు మంజూరు. తాడ్వాయి మండల కేంద్రానికి ఐటీఐ మంజూరు. 100 పడకల ఆస్పత్రి. నాగిరెడ్డిపేట మాల్తుమ్మెదలో నిజామాబాద్‌-మెదక్‌ ల నడుమ అగ్రిపాలిటెక్నిక్‌ కళాశాల. ముస్లిం, కైస్త్రవులకు మ్యారేజీహాల్స్‌ నిర్మాణం వంటి తదితర పనుల మంజూరు, పూర్తికి సీఎం హామి ఇచ్చారు.