బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిలువరించండి
` సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
– బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకొనేందుకు అనుమతివ్వాలని అభ్యర్థన
– గురువారం లేదా శుక్రవారం విచారణ!
` అంశంపై సమగ్ర, శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాం
` ప్రత్యేక కేసుగా పరిగణించాలని వినతి
న్యూఢల్లీి(జనంసాక్షి):బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం సడలని సంకల్పంతో ముందుకు వెళ్తుంది. జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని, కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పేర్కొంది.అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకుమించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసింది. రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావ్ గావ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించిందంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంతమేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై సమగ్ర, శాస్త్రీయ అధ్యయనం నిర్వహించామని తెలిపింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33 శాతం మంది బీసీలు ఉన్నట్లు తేలిందని 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు అదే ప్రాతిపదికంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342-%A%(3) కింద దాఖలు పడిన అధికారాలను అనుసరించి ప్రభుత్వం ఈ కసరత్తు చేసిందని ఇలాంటి కసరత్తును రాహుల్ రమేశ్ వాఫ్‌ు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సమర్థించిందంది.సమగ్ర కుల సర్వే తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిటైర్ట్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ సర్వే డేటాను విశ్లేషించిందంది. లోతైన అధ్యయనం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందంది. దాన్ని అనుసరించి తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు-2025ను శాసనసభ, శాసనమండలిలో గత మార్చి 17, 18 తేదీల్లో ఏకగీవ్రంగా ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపామని సుప్రీంకోర్టుకు వివరించింది.రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అన్నది కేవలం వివేకపూర్వకమైన నియమం తప్ప అదేమీ రాజ్యాంగపరమైనది కాదని ప్రత్యేక, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఆ పరిమితికి మించి కేటాయించేందుకు అనుమతించవచ్చని ఇందిరా సాహ్ని తీర్పు పేరా 810లో 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని సుప్రీం కోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. 50 శాతం అనేది సాధారణ నియమం అయినప్పటికీ దేశంలో వైవిధ్యం, ప్రజల భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని వారసత్వంగా వచ్చిన కొన్ని అసాధారణ పరిస్థితులను విస్మరించకూడదని మారుమూల ప్రాంతాలు, పల్లెల్లో నివసించే ప్రజలు సాధారణ జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు వారి పరిస్థితులను వేరుగా చూడాల్సిన అవసరం రావచ్చని సర్కారు పేర్కొంది.
ప్రత్యేక కేసుగా పరిగణించాలని
అటువంటి సందర్భాల్లో నియమాల్లో కొంత సడలింపు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడవచ్చంది. అలాంటి సందర్భాల్లో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని దాన్నో ప్రత్యేక కేసుగా పరిగణించాలని ఆ తీర్పులో కోర్టు చెప్పిందని జనహిత్ అభియాన్ కేసు తీర్పులోని పేరా 172లోనూ అలాంటి అంశమే ఉందని గుర్తు చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకొని జీవో జారీ అయ్యిందంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీ ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అస్పష్టతను ఏర్పరిచాయని, ఒకవైపు జీవోపై స్టే విధించిన హైకోర్టు, మరోవైపు ఎన్నికలపై స్టే విధించడంలో సంయమనం పాటించిందంది. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, ఇలా చేస్తే వెనుకబడిన తరగతుల వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను నిలువరించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకొనేందుకు అనుమతివ్వండని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.రాష్ట్ర శాసనసభ, శాసనమండలి మార్చి 17, 18 తేదీల్లో పాస్ చేసి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా మార్చి 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారని సర్కారు పేర్కొంది. దానిపై కేంద్ర హోంశాఖ జూన్ 12న వివరణ కోరిందని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ ప్రభుత్వం జులై 22న సమాధానాలు పంపిందంది. అయినప్పటికీ ఆ బిల్లులను వెనక్కు పంపడం గానీ, ఆమోదించడం గానీ చేయలేదంది.తమిళనాడు గవర్నర్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులకు మూడు నెలల్లోపు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే వాటికి ఆమోదముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని సర్కారు గుర్తు చేసింది. ఈ విషయం పరిగణనలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను మంగళవారం కోర్టు రిజిస్ట్రార్ దగ్గర ప్రభుత్వ న్యాయవాదులు మెన్షన్ చేశారు. గురువారం లేదా శుక్రవారం విచారించాలని విజ్ఞప్తి చేశారు. సీజేఐ అనుమతితో లిస్ట్? చేయనున్నట్లు రిజిస్ట్రార్‌పేర్కొన్నారు.