హైకోర్టు స్టే ఏకపక్షం

` బీసీ రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు చల్లారు
` బంద్‌తో బిసిల ఆకాంక్షను వెల్లడిస్తాం:ఆర్‌. కృష్ణయ్య
హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీల వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చిందని బీసీ రిజర్వేషన్స్‌ సాధన సమితి కన్వీనర్‌ ఆర్‌.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. తామంతా రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నోటికాడ బుక్క ఎత్తిపోయిందన్నారు. ఇది తమను ఎంతగానో ఆందోళనకు గురిచేసిందన్నారు. మంగళవారం బీసీ సంఘాల తెలంగాణ బంద్‌ పోస్టర్స్‌ని ఆర్‌.కృష్ణయ్య, కోదండరాం, జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య విూడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో న్యాయం జరుగలేదని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇచ్చి బీసీల నోటికాడి ముద్దను లాక్కుందని విమర్శించారు. బీసీలకు అవమానం, అన్యాయం జరిగిందని ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ సంఘాలు చెప్పిన అంశాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయని టీజేఎస్‌ అధ్యక్షులు, ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. బీసీ బంద్‌కి ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించామని కోదండరాం పేర్కొన్నారు.బీసీ రిజర్వేషన్స్‌ని అడ్డుకోవద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. ఈ నెల 18వ తేదీన నిర్వహించే తెలంగాణ బంద్‌కి సంపూర్ణ మద్దతు తెలపాలని బీసీ జేఏసీ తెలంగాణ జన సమితి నేతలు తమ కార్యాలయానికి వచ్చి అడిగారని తెలిపారు. తమ కంటే ముందే బంద్‌కి కోదండరాం సంపూర్ణ మద్దతు తెలిపారని గుర్తుచేశారు. కోదండరాం మద్దతుతో బంద్‌ వందశాతం సక్సెస్‌ అయినట్లేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కోదండరాం అని ప్రశంసించారు. తెలంగాణలోని రెండున్నర కోట్ల బీసీల హక్కుల కోసం ఈ బంద్‌ చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ సమాజం ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టిందని గుర్తుచేశారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్స్‌ కోసం బిల్లు రూపకల్పన చేశారని జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. బీసీల నోటికాడి ముద్దను కొంతమంది లాక్కుంటున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్స్‌ వ్యతిరేకులారా.. జనాభా దామాషా ప్రకారం తమ వాటా తమకు కావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లాలని సూచించారు. అఖిల పక్షాన్ని రాష్ట్రపతి, ప్రధానిని కల్పించాలని కోరారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే.. వారి ఇళ్ల ముందు ధర్నా చేపట్టాలని జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు.