మరియా కొరీనాను వరించిన నోబెల్‌ శాంతి బహుమతి

` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం
` నోబెల్‌ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితమన్న విజేత
స్వీడన్‌(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి  2025 మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. అయితే, ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్‌ అవ్వగా.. అకాడవిూ సభ్యులు మరియా వైపు మొగ్గుచూపారు. వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్‌ కమిటీ వెల్లడిరచింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని.. గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. ఆమె వెనెజువెలా పార్లమెంట్‌ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా పనిచేశారు. వెనెజువెలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె.. శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషిచేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్‌ కమిటీ వెల్లడిరచింది. నోబెల్‌ శాంతి బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా పాకిస్థాన్‌కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ నిలువగా.. జోసెఫ్‌ రాట్‌బ్లాట్‌ 86 ఏళ్ల వయసులో దీనిని అందుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోను వరించింది. ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాటానికి గాను ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేశారు. నోబెల్‌ శాంతి బహుమతికి మరియా కొరినా ఎంపిక కావడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ బహుమతిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. నోబెల్‌ శాంతి బహుమతి అందుకోవాలని ట్రంప్‌ అధ్యక్ష పీఠంపై ఎక్కిన నాటి నుంచి తహతహలాడిపోతున్నారు. ఆ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పీవోకేతోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత సైన్యం దాడులు చేపట్టింది. కొన్ని గంటల తర్వాత ఈ దాడులు ఆగిపోయాయి. దీంతో ఈ దాడులు తన ఆదేశాలకు అనుగుణంగానే ఆగిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వివిధ వేదికల విూద నుంచి పలు సందర్భాల్లో ప్రపంచానికి చాటే ప్రయత్నాన్ని చేశారు. కానీ ట్రంప్‌ చేసిన ఈ తరహా వ్యాఖ్యలను భారత్‌ నిర్ద్వంద్వంగా తొసిపుచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గాజా`హమాస్‌ యుద్దవిరమణకు ఒత్తిడి తెచ్చారు. అయినా ఆశలు దక్కలేదు.
నోబెల్‌ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితం: మరియా కొరీనా
ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరకు వెనెజువెలా హక్కుల కార్యకర్త మరియా కొరీనా మచాడోను ఈ పురస్కారం వరించింది. దీనిపై తాజాగా మచాడో తన సోషల్‌ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతోపాటు తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోన్న  డొనాల్డ్‌ ట్రంప్‌నకు అంకితం ఇస్తున్నానని చెప్పారు.‘‘వెనెజువెలా ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించడం మా పోరాటం ముగింపునకు ఊతమిస్తుంది. స్వేచ్ఛ పొందేందుకు దోహదపడుతుంది. విజయానికి దగ్గరలో ఉన్నాం. గతంలో లేనంతగా అధ్యక్షుడు ట్రంప్‌, అమెరికా, లాటిన్‌ అమెరికా ప్రజలపై ఆధారపడతాం. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు మాకు ప్రధాన మిత్రులు. ఈ పురస్కారాన్ని కష్టాల్లో ఉన్న వెనెజువెలా ప్రజలతోపాటు మా పోరాటానికి నిర్ణయాత్మక మద్దతు ఇస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌నకు అంకితం చేస్తున్నా’’ అని మరియా పేర్కొన్నారు.అంతకుముందు నార్వే నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ క్రిస్టియన్‌ బ్రెగ్‌ హార్ప్‌క్వెన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శాంతి పురస్కారాన్ని ఇవ్వనున్న విషయాన్ని ఆమెకు ముందుగానే తెలియజేశారు. ‘‘నాకు ఈ పురస్కారం రావడం నమ్మలేకపోతున్నా. మాటలు రావట్లేదు. వెనెజువెలా ప్రజల తరఫున ధన్యవాదాలు. మేము సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. ఇదో ఉద్యమం అని మీరు అర్థం చేసుకున్నారని భావిస్తున్నా. అయితే, ఇది నా ఒక్కరి గెలుపు కాదు. వ్యక్తిగతంగా నేను దీనికి అర్హురాలిని కాదని అనుకుంటున్నా. ఇది సమాజం మొత్తం సాధించిన విజయం. మా ప్రజలకు లభించిన అతిపెద్ద గుర్తింపు’’ అని మరియా కొరీనా పేర్కొన్నారు.వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మరియా కొరీనాకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నార్వే నోబెల్‌ కమిటీ వెల్లడిరచింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని.. ఏడాది కాలంగా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది.