క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారు

ఆర్మూర్ ఎంజె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ

ఆర్మూర్,అక్టోబర్ 10 (జనంసాక్షి) : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఇంటి కుటుంబ సభ్యులే వేధింపులకు గురి చేస్తున్నారని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మహిళ ఆర్మూర్ పట్టణంలోని ఎం జె హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. భర్త రాథోడ్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. జక్రన్ పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మౌనిక భర్త గణేష్ పాత ఇంటిని కూల్చివేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరైనందున కట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గణేష్ తండ్రి కిషన్, బాబాయిలు రాము, హరి, విట్టల్, రేణుక ఇంటి నిర్మాణం చేసుకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. పాత ఇంటి రిజిస్ట్రేషన్,ఇల్లు టాక్స్, కరెంట్ బిల్లు కొన్ని ఏండ్లుగా తానే కడుతున్నానని వివరించారు. గతంలో తండ్రి బాబాయిలే ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకోమని,లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఆపేందుకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంలో జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్సై ఫిర్యాదును సైతం తీసుకోవడం లేదని చెప్పారు. కొన్ని రోజులుగా ఇంటి నిర్మాణం విషయంలో వేధింపులకు గురిచేస్తూ, చంపేస్తామని కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని వాపోయారు. ఇదే విషయంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో గొడవ జరగగా భార్య రాథోడ్ మౌనిక ఇంట్లోనే క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను ఆర్మూర్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చామని చెప్పారు. నా భార్య ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.