అడవి బిడ్డలకు వైద్యం అందేనా..?

కరకగూడెం,జులై (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా ప్రగతిలో పరిగెడుతుందని అధికార తెరాస నాయకులు, మంత్రులు, అధికారులు ప్రచార ఆర్భాటాలు అంబరాన్ని అంటుతున్నాయి. అందుకు విరుద్ధంగా పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల అశ్వాపురం గడ్డ(మోతే) లో నివాసం ఉంటున్న
ఆదివాసి గిరిజనులకు అత్యవసర పరిస్థితులలో వైద్యం పొందాలంటే సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారికి చేరాలంటే ఆ ఆదివాసి గిరిజనులు కుర్చీలో అనారోగ్య పీడితులను కూర్చోబెట్టుకుని, ఆ కుర్చీని తాళ్లతో ఒక కర్ర కట్టుకొని కనీస రహదారి సౌకర్యం కూడా లేని, బురదతో కూడిన కాలిబాటలో నానా కష్టాలు పడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్యం కోసం అర్రులుచాస్తున్నారు. సోమవారం రోజున పొడియం దేవి (22) అనే గర్భిణీ మహిళ ఆకస్మిక నొప్పులతో  సతమతమవుతుంటే అందుబాటులోకి 108 వాహనం చేరుకోలేని పరిస్థితి.108 వాహనం లోనికి పోక స్వయంగా గ్రామస్తులే  ఆమెని, కర్రకి కుర్చీ కట్టి అందులో మోసుకోని అంబులెన్స్ దగ్గరికి తీసుకొచ్చారు.అయితే ఏమన్నా అత్యవసరమైతే ఇదే నా మా పరిస్థితి అని  గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రజా ప్రతినిధులు అధికారులు ఓట్ల కోసం  వస్తారు తప్ప, మా బాగోగులు అడిగి తెలుసుకుని నాధుడు లేకపోయే అని అంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవ తీసుకొని ఆ సమస్యలను తీర్చండి అని గ్రామస్తులు వేడుకుంటున్నారు.