అదిరిపోయేలా అవతరణ వేడుకలు

సింగరేణి  వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న సిఎండి
భద్రాద్రికొత్తగూడెం,మే29(జ‌నం సాక్షి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు ప్రకటించారు.  ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబింపజేసే విధంగా నిర్వహించనున్నామని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా  నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.  జిల్లాకు చెందిన ఎంపీలు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా రానున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. స్టేడియం గ్రౌండ్‌ను ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా రానున్నారు. జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను వివరించారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ వేడుకలను అంబరాన్ని అంటేలా… నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం సన్నద్దమవుతోంది. శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అన్ని మండల కేంద్రాలు , పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దుకాణాలను, ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించే విధంగా ప్రత్యేక శోభాయమానంగా తీర్చి దిద్దాలని ఇందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించినవారిని ఎంపిక చేసి సత్కరించాలని సూచించారు. జిల్లా లోని 23 మండలాలతో పాటు, నాలుగు మున్సిపాలిటీలలో జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను ధూంధాంగా నిర్వహించి కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేకతను సంతరింపజేయాలని కలెక్టర్‌ అధికార యంత్రాంగానికి తెలియచెప్పారు. జిల్లా కేంద్రంలోకూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్‌, మున్సిపాలిటీల స్థాయిలలో అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రావతరణ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు స్వయం సహాయక సంఘ సభ్యులను, అంగన్‌వాడీ, ఆశాకార్యకర్తలను భాగస్వాములను చేస్తామన్నారు. జిల్లాలో తెలంగాణ
సంస్కృతి,సంప్రదాయాలు, అదే విధంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి జరిగిన పోరాటాలు, తదితర అంశాలకు సంబంధించిన ఫోటోలు ఎవరివైద్దెనా ఉంటే వాటిని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి మెయిల్‌ద్వారా పంపాలన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జూన్‌2 ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖల ద్వారా రాష్ట్ర మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారు.
————