అద్వానీ ‘రాజీ’పడ్డారు రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11 (జనంసాక్షి) :
బీజేపీ అగ్రనేత అద్వానీ రాజీపడ్డారు. పార్టీ ముఖ్యనాయకులంతా ఆయనకు నచ్చజెప్పడంతో తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం సాయంత్రం వెల్లడించారు. అయితే అద్వానీ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని భాజపా ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా నియమించడంపై అద్వానీ అలకబూనారు. పార్టీకి ఇంతకాలం సేవ చేసే అదృష్టం దక్కిందని, ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు రాజ్‌నాథ్‌కు లేఖ రాశారు. దీనిపై రెండు రోజుల పాటు సాగిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అద్వానీతో చర్చించి ఒప్పించినట్లు సమాచారం. రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మోడీ నియామకంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. మీడియా సమావేశానికి అద్వానీ కూడా వస్తానన్నారని, తామే వద్దని చెప్పామని వివరించారు.