అధికారంలోకి వస్తాం.. తెలంగాణ ఇస్తాం…!
ఎన్నికలు ఎప్పుడొచ్చినాతాము అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. అలా గని ఏమాత్రం ఏమరపాటు లేకుండా పార్టీ గెలుపే లక్ష్యంగా కృషిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై, సొంతగడ్డ కరీంనగర్‌లో శుక్రవారం మొదటిసారి అడుగుపెట్టిన ఆయనకు జిల్లా కాషాయ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. నగరంలో ఊరేగింపు అనంతరం పార్టీ జిల్లా కార్యవర్గం, పద్మనాయక కల్యాణమండపంలో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలంటే తెలంగాణలో అత్యధిక సీట్లు గెలవాల్సి ఉందన్నారు. ఆవెంటే వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు. తామోప్పుడూ అధికారం కోసం తెలంగాణను వాడుకోలేదనీ, ఇప్పటికీ కాంగ్రెస్ బిల్లుపెడితే మద్దతు ఇస్తామంటున్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ మొదటి నుంచీ తెలంగాణకు వ్యతిరేకమేననీ, మరోసారి ఆపార్టీ అధికారంలోకి వస్తే ఇక ఎప్పటికీ తెలంగాణ రాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. అధికారంలోకి వచ్చేది, తెలంగాణ ఇచ్చేది తామేనన్నారు. తమది కాంగ్రెస్‌లా వారసత్వ రాజకీయాల పార్టీ కాదనీ, బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అని చెప్పారు. బీజేపీ ఒక కుటుంబమనీ ఇలాంటి వాతావరణం ఏ పార్టీలో లేదని, ఏబీవీపీలో పని చేసిన మిత్రులతో కలిసి ఈ హోదాలో కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ముఖ్యమంత్రి అస్తమిస్తున్న కిరణ’ మంటూదును మాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ నాయకులు ప్రొఫెసర్ శేషగిరిరావు, మాజీ ఎంపీ జంగారెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాశిపేట లింగయ్య, పొన్నాల శ్రీరామ్ , కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పీ. సుగుణాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి బల్మూరి వనిత, కార్యవర్గ సభ్యులు కోమల అంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, కన్నబోయిన ఓదెలు, శశిభూషన్ కాచెతోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.