అనుమతిస్తే శాంతియుతం ఇవ్వకపోతే మీ ఇష్టం

గవర్నర్‌కు తెగేసి చెప్పిన తెలంగాణ ప్రజాప్రతినిధులు
హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) :
అనుమతి ఇప్పించండి.. శాంతియుతంగా చలో అసెంబ్లీ నిర్వహించుకుంటాం.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.. ఆరుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోమారు ప్రపంచానికి చాటుతాం.. అనుమతి ఇవ్వకపోతే ఇక మీ ఇష్టం అని గవర్నర్‌ నరసింహన్‌కు తెగేసి చెప్పినట్లు టీఆర్‌ఎస్‌ నాయకుడు కె.కేశవరావు, బిజెపి ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ తెలిపారు. గురువారం సాయంత్రం గవర్నర్‌ను వీరంతా కలిసి వినతిపత్రం అందజేశారు. రాజ్‌భవన్‌ నుంచి వెలుపలికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలుత కేశవరావు మాట్లాడుతూ, చలో అసెంబ్లీని శాంతియుతంగా నిర్వహించుకుని తమ నిరసనను తెలియజేస్తామని, అందుకు సహకరించాలని గవర్నర్‌ను కోరామన్నారు. ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. నిన్నటి నుంచి తరలివస్తున్న తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడే అడ్డుకుని అరెస్టు చేయడం.. 48 గంటలు దాటినా విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. అనంతరం నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, అక్రమ నిర్బంధాలకు పాల్పడడం అన్యాయమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు. ఇందిరాపార్కు నుంచి రెండు కిలోమీటర్లు కానీ, నాలుగు కిలోమీటర్లు కానీ ఎంతో కొంతమేర అనుమతి ఇవ్వాలని కోరారు. అనుమతి ఇవ్వకపోతే శుక్రవారం జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ మాట్లాడుతూ, మూడు రోజులుగా ముఖ్యమంత్రిని కలుస్తూనే ఉన్నామని, అనుమతి ఇవ్వాలని కోరుతూనే ఉన్నామని అన్నారు. బుధవారం డిజిపిని, గవర్నర్‌ నరసింహన్‌ను కలిశామని.. చలో అసెంబ్లీకి ప్రభుత్వం సహకరించేలా చూడాలని కోరామన్నారు. నిన్నటిన నుంచి తెలంగాణ ప్రాంతమంతా మినీ ఎమర్జెన్సీలా ఉందని అన్నారు. ఇలాంటి ఘటన నేటివరకు చూడలేదన్నారు. శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించుకుంటామంటే ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా అనుమతి ఇవ్వాలని కోరారు.