అన్నపూర్ణ డెల్టాను ఏడారిగా మారుస్తున్నారు
గుంటూరు, జూలై 18 : డెల్టాకు సాగునీటి విడుదలలో ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి రైతుల్లో సహనం కోల్పోయేలా చేస్తోందని రైతులు రోడ్డు మీదకు వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మసైపోతారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 150 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా డెల్టాకు నీటిని ఎట్టిపరిస్థితిలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు నీరు అందించకపోతే 12 నుంచి 13 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్దకంగా మారుతుందన్నారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా లేకపోవడంవలనే సాగర్ నీటి విడుదలపై హైకోర్టు నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయన్నారు. ఈ ఏడాది మేలో ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలపై పునః సమీక్షించిన తర్వాతనే డెల్టాకు నీటి విడుదల నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకొని, మరలా ఇప్పుడు తప్పించుకునే ధోరణిని ప్రదర్శిస్తుండడం సరికాదన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణగా వెలిగిన డెల్టాను ఎడారిలో మార్చేస్తున్నారన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలను ఏమి చేయదలచుకున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. వారంలో రైతులతో మాట్లాడి తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో మన్నవ సుబ్బారావు, దాసరి రాజా, లాల్‌వజీర్, శివప్రసాద్ పాల్గొన్నారు.