మాట నిలబెట్టుకున్న రేవంత్‌..

స్వయం కృష్టికి రూ.కోటి నజరానా..
` ఆస్కార్‌కు సర్కార్‌ సంస్కార్‌..
` ఇచ్చిన హామీ మేరకు గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.కోటి ప్రకటన
హైదరాబాద్‌(జనంసాక్షి): గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. ఎన్నికల ముందు రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన రేవంత్‌రెడ్డి…కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.కోటి ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాతబస్తీ బోనాల సందర్భంగా తాజాగా.. రూ.కోటి నజరానా ప్రకటించారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్‌ సిప్లిగంజ్‌ యువతకు ఆదర్శమని ఈ సందర్భంగా సీఎం అన్నారు.ఓల్డ్‌ సిటీ నుంచి ‘ఆస్కార్‌’ వరకూ వెళ్లిన కుర్రాడంటూ రాహుల్‌ను ‘గద్దర్‌’ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో సీఎం రేవంత్‌ కొనియాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి అతడికి ‘గద్దర్‌’ పురస్కారం దక్కలేదని, అతడి ప్రతిభకు తగ్గ అవార్డుగానీ, మరో ప్రోత్సాహకంగానీ ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు.‘కాలేజ్‌ బుల్లోడా’, ‘వాస్తు బాగుందే’, ‘రంగా రంగా రంగస్థలానా’, ‘బొమ్మోలే ఉన్నదిరా పోరి’, ‘నాటు నాటు’ వంటి సినిమా పాటలు, ‘ఓ నా రాహులా’, బోనాలు, వినాయక చవితి తదితర స్పెషల్‌ సాంగ్స్‌తో రాహుల్‌ శ్రోతలను అలరించారు. ‘రంగమార్తాండ’తో నటుడిగానూ ఆకట్టుకున్నారు.