‘అన్నా’ I మీడియా !
ఏమైంది ? మొన్నటి వరకు అందరూ ఆయనన్ని ఆకాశానికి ఎత్తుకున్నారు. ముఖ్యంగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ మీడియా, ఇలా ఒకటేమిటి దేశంలో ఉన్న ప్రసార మాధ్యమాలన్నీ ఆయన్ని ఆరు పదులు దాటిన యువకుడన్నారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపిత మరో మహాత్మాగాంధీ అని కొనియాడారు. అవినీతి రహిత దేశం కోసం ఉద్యమిస్తున్న నిత్య ఉద్యమకారుడని గొంతులు చించుకునేలా అరిచారు. నేటి యువతకు ఆయన ఆదర్శమని ప్రశంసల వర్షం కురిపించారు. భారదేశానికి నిజాయితీ గల కొత్త రథసారథి దొరికాడని, ఆయనకు తమ వంతు బాధ్యతగా అండగా నిలుస్తామని, ఆయన ఆశయ సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తామని, ఆయన ఆదర్శాలే.. తమ అజెండాలని యావత్ భారతదేశంలోని మీడియా సమస్త మీడియా ఆయన జపం చేసింది. ఇంతకీ ఎవరాయన ? ఎవరా ఆరు పదులు దాటిన నిత్య యౌవనుడు ? ఎవరా నిత్య ఉద్యమకారుడు ? ఏమిటి ఆయన ఆశయం ? ఆయనకెందుకంత లభించింది ప్రచారం ? సమాధానం ఈ ప్రశ్నలందరికీ సమాధానం ఒక్కటే. అవినీతి రహిత భారతదేశ నిర్మాణానికి ఎలాంటి షరతులు లేని లోక్‌పాల్ బిల్లును తేవాలన్న ఆశయంతో, విదేశాల్లో మూలుగుతున్న దేశంలోని అక్రమార్కుల అవినీతి సొమ్మును బయటకు తేవాలన్న మహోన్నత లక్ష్యంతో ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే. అందుకే ఆయనకు అంత ప్రచారం లభించింది. ఆయన ఆకాంక్ష విస్తరించేలా ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీడియా అంతగా ప్రచారం ఇచ్చింది. లైవ్ షోలు, అన్నా అనుచరుల ఇంటర్వ్యూలతో హోరెత్తించింది. సగటు భారతీయుడికి కూడా అన్నా లక్ష్యం అర్థమయ్యేలా పూసగుచ్చినట్లు విడమరిచి, వివరించి చెప్పింది. ప్రతిపక్ష పార్టీలు ఆయనకు మద్దతివ్వడంలో ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. కానీ, ఎప్పుడైతే అన్నా హజారే సాక్షాత్ ప్రధానమంత్రిని కూడా లోక్‌పాల్ బిల్లు కిందికి తేవాలన్నారో.. అప్పుడే రాజకీయ పార్టీలు గప్‌చుప్ అయిపోయాయి. ఇది రాజకీయ నాయకులకు అలవాటే ! వాళ్లు గోడ మీది పిల్లులని తెలిసిన ప్రజలు కూడా నవ్వి ఊరుకున్నారు. ఇదంతగా పట్టింకోవాల్సిన సంగతేం కాదు కానీ, ప్రస్తుతం పట్టింకోకుండా వదిలేద్దాం. కానీ, సమాజంలో నాలుగో స్తంభంగా చెప్పుకునే, ప్రభుత్వానికి, ప్రజలకు తామే వారధులమని గుండెలు బాదుకునే, నిజాలను నిర్భయంగా వెలికితీస్తామని, ఏ పార్టీకి కొమ్ముకాయమని, నిజాలు చెప్పే ధైర్యమే తమ అజెండా అని, కుల రహిత సమాజం కోసమే తాము పని చేస్తున్నామని, దేశభక్తియే తమ ఆయుధమని ఇలా నానా కొటేషన్లతో తమ రేటింగ్స్‌ను పెంచుకునే మీడియా చానళ్లు కూడా అన్నా హజారే వార్తలను తూ.తూ. మంత్రంగా ప్రసారం చేస్తున్నాయి. కిందటి అన్నా ఉద్యమానికి అంతగా ప్రచారం కల్పించిన మీడియా నేడు అన్నాను పట్టించుకోవడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎందుకు ? మరి అన్నా హజారే ఉద్యమం నుంచి వెనక్కు తగ్గారా ? ఆయన ఆలోచనకు ఆదరణ తగ్గిందా ? ఆయన అనుచరులెవరైనా ఆయనపై లేనిపోని ఆరోపణలు చేశారా ? ఆయన లక్ష్యం సరికాదని ఎవరైనా మేధావులు భావిస్తున్నారా ? ప్రజలు ఆయనను నమ్మడం లేదా ? మరెందుకు మీడియా ఆయన ఉద్యమాన్ని లెక్క చేయడం లేదు ? అదో సామెత ఉంది కదా.. చచ్చేటోడు ఎలా చచ్చినా, దానికి కారణం మాత్రం ఉండకపోదని. ఇదే కారణాన్ని అన్నా మీడియాపై సంధించారు. అదే.. కార్పొరేట్ మీడియాను కూడా లోక్‌పాల్ పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌ను లేవనెత్తారు. ‘బస్ ఖేల్ ఖతం కాక ముందే మీడియా దుకాణం బంద్ అయిపోయింది’. తమపై కూడా అన్నా లోక్‌పాల్ వాత పెడతారని భావించని మీడియా నాడు ఆ నిత్య ఉద్యమకారుడికి జేజేలు పలికింది. అన్నా ఉద్యమం ఎంత ఉధృతంగా సాగుతున్నదో కళ్లకుగట్టినట్లు యావత్ దేశానికి చూపించింది. ఎప్పుడైతే అన్నా మీడియా నెత్తిన పిడుగు వేశాడో అప్పుడే మీడియాధిపతుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ‘ఏదో మా వార్తలు మేము ప్రసారం చేసుకుంటుంటే.. ఈ అన్నా సాబేందిర భయ్.. మా బ్యారానికే ఎసరు పెట్టేట్లున్నడు’ అనుకున్నాయి. అంతే.. నాటి నుంచి అన్నా చేస్తున్న దీక్షలకు ఫలానా మద్దతిచ్చారని, అన్నా బృందంలో గొడవలున్నాయని, అన్నా దీక్ష నేటి నుంచి ప్రారంభం.. నేటికి సమాప్తం అన్న శీర్షికలతో నామ మాత్రపు వార్తలను ప్రసారం చేస్తూ.. తమ ప్రయోజనాల కోసం ఆ మాజీ స్వాంతంత్య్ర సమరయోధుడు, విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సు దేశ ప్రయోజనాల కోసం అవినీతి వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తున్న నేటి యువతరానికి ఆదర్శ పురుషుడు అన్నా హజారే ఉద్యమాన్ని నీరుగారుస్తున్నాయి. పరోక్షంగా అవినీతిపరులు తమ ద్వారాలను తెరిచేందుకు సహకరిస్తున్నాయి. ఇదీ ప్రస్తుతం మన దేశంలోని ‘సమాజపు నాలుగో స్తంభం’ దుస్థితి. ‘కట్టుకథలకు, పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు’ అని శ్రీశ్రీ రాసిన వాక్యాలను, గురువింజ కింద ఎంత వెదికినా నలుపే గానీ, తెలుపు కానరాదన్న సత్యాన్ని నేటి ‘సమాజ వారధులు’ నిజం చేస్తున్నాయి.