అన్ని వర్గాల ప్రజలకు అండగా తెరాస
– రైతుబంధుతో కాంగ్రెస్ అడ్రస్సు గల్లంతే
– మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, మే25(జనంసాక్షి) : తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, కులాల సమాన ఫలాలను అందిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధుల నుంచి రూ.25లక్షల వ్యయంతో ఏకలవ్వ ఎరుకల కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు నెలల్లో ఈ భవనాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలను త్వరలోనే నిర్మించుకుందామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా పందుల పెంపకం యూనిట్ సూర్యాపేటకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పొడి చెత్తను అందించే విధంగా వెదురు బుట్టలు అల్లి మున్సిపాలిటీకి అందించే ప్రాజెక్టులో భాగస్వామ్యమై ఉపాధిని పెంపొందించుకోవాలని ఎరుకల కులస్తులకు సూచించారు. పూర్వీకుల పేర్ల విూద ఉన్న ఎరుకల కులస్తుల ఇళ్లను తక్షణమే మార్పిడి చేయాలని మున్సిపల్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అరవై ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ముందుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఓ ప్రణాళితో దేశం మొత్తం తెలంగాణ వ్యవసాయం వైపు చూసేలా చేస్తున్నారని కొనియాడారు. రైతుబంధు పథకంతో సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేకూరిందన్నారు. గతంలో ఖరీఫ్ సాగు ప్రారంభమైందంటే రైతులు విత్తనాలు, ఎరువుల కోసం కాకుండా ముందుకు వడ్డీ వ్యాపారస్తులు, బ్యాంకుల చుట్టూ తిరిగేవారని, ప్రస్తుతం రైతుబంధుతో నేరుగా దుకాణాలకు వెళ్లి విత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతుందన్నారు. తాజాగా రైతుబంధుతో కాంగ్రెస్ అడ్రస్సు గల్లంతు కావటం ఖాయమన్నారు. దీనిని తప్పించుకొనేందుకు పెద్దరైతులకే రైతుబంధు ఉపయోగపడుతుందని దుష్పచారం చేస్తూ ఉనికిచాటుకొనేందుకు యత్నిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని మంత్రి హెచ్చరించారు. —