అపహరించిన వారిలో తొమ్మిది మంది హతం

పీసీసీ చీఫ్‌, అతడి కుమారుడి కాల్చివేత
కేంద్ర మాజీ మంత్రి శుక్ల పరిస్థితి విషమం
రాయ్‌పూర్‌, మే 26 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు శనివారం అపహరించిన వారిలో పీసీసీ అధ్యక్షుడు నందకుమార్‌ ఆయన కుమారుడు దినేష్‌ సహా తొమ్మిది మందిని హతమార్చారు. శనివారం సాయంత్రం మావోయిస్టులు కాంగ్రెస్‌ నేతలే లక్ష్యంగా దాడి చేసిన ఘటనలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్‌ ముదిలియార్‌తో పాటు మొత్తం 20 మంది మృతి చెందారు. కేంద్ర మాజీ మంత్రి వి.సి శుక్లా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స కోసం ఆదివారం ఢిల్లీ తరలించారు. మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఈ ఘటనను నిరసిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఛత్తీస్‌గఢ్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇదిలావుంటే మావోయిస్టుల దాడిలో గాయడిన వారిని పరామర్శించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ జదల్‌పూర్‌ చేరుకున్నారు. మావోయిస్టులు దాడి ఘటనలో 20 మంది మృతి చెందగా 19 మంది గాయపడిన సంగతి తెలిసిందే. నందకుమార్‌ పటేల్‌ మృతదేహాన్ని సుక్మా జిల్లాలో గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 30వరకూ ఉండొచ్చని సమాచారం. ఈ ఘటన కేంద్రంలో ప్రకంపనలు సృష్టించింది. దాడిని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. అత్యవసరంగా సమావేశమై పరిస్థితి సమీక్షించారు. అపహరించిన వారిని విడుదల చేయాలంటూ మావోయిస్టులను ప్రధాని కోరినా లాభం లేకుండా పోయింది. దక్షిణ బస్తర్‌ ప్రాంతంలోని సుకుమా జిల్లాలో శనివారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ నేతల వాహనశ్రేణిని మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని, తొలుత మందుపాతర పేల్చి, ఆతర్వాత విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. భారీగా ఆయుధాలను ధరించిన 150 మంది నక్సల్స్‌ ఈ దాడిలో పాల్గొన్నారు. శుక్లాతోపాటు కుంట ఎమ్మెల్యే కవాసి లక్మా, మహిళా నాయకురాలు పూల్‌మతి దేవి సహా 19 మందికి గాయాలయ్యాయి. శుక్లా శరీరంలో మూడు తూటాలు దిగడంతో ఆయనను . జగదల్‌పూర్‌ ఆస్పత్రికి తరలించి  శస్త్రచికిత్స చేసి తూటాలు తీశారు.  గాయపడినవారిని జగదల్‌పూర్‌ మహారాణి ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మరోపక్క ఈ ఘటనస్థలానికి 600 మంది సీఆర్పీఎఫ్‌ దళాలను కేంద్రం తరలించింది. కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి ఆర్‌.పి.ఎన్‌.సింగ్‌ ఆదివారం ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ పరివర్తన్‌ యాత్రను చేపట్టింది. శనివారం సాయంత్రం 3 గంటలకు సుకుమాలో మహేంద్ర కర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి వీసీ శుక్లా కూడా హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత జగదల్‌పూర్‌ వెళ్తున్న మహేంద్రకర్మ, కాంగ్రెస్‌ నేతల వాహనశ్రేణి 5.30గంటలకు తోంగ్‌పాల్‌-దర్భాఘాట్‌ సమీపంలోకి రాగానే మాటు వేసిన మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో చివరి వాహనం తునాతునకలయ్యింది. దీంతో వాహనశ్రేణి నిలిచిపోయింది. దాదాపు 150 మంది మావోయిస్టులు విచ్చలవిడిగా దాడి చేసి కాల్పులకు దిగారు. ఈ దాడిలో మహేంద్రకర్మ, కాంగ్రెస్‌ నాయకులు గోపి మాధవన్‌, రాజ్‌నంద్‌గామ్‌ మాజీ ఎమ్మెల్యే ఉదయ్‌ ముదిలియార్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుంను ప్రారంభించిన కర్మ.. చాలా కాలంగా మావోయిస్టులతో పోరాడుతున్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ జిల్లాలో అపహరణకు గురైన తన తండ్రి, సోదరుడు దినేశ్‌లను విడుదల చేయాలని పీసీసీ అధ్యక్షుడు నందకుమార్‌ కుమారుడు ఉమేశ్‌ పటేల్‌ నక్సల్స్‌కు విజ్ఞప్తి చేసినా వారు కరుణించలేదు. వారిని కూడా కాల్చి చంపారు.  కుంట ఎమ్మెల్యే లక్మా తలకు బుల్లెట్‌ గాయం కావడంతో ఈయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి తర్వాత నక్సల్స్‌.. సవిూపంలోని చెట్లకు నిప్పు పెట్టారు. ఘాట్‌రోడ్డులో ఈ సంఘటన జరగడంతో బాహ్యప్రపంచానికి సమాచారం చేరడానికి చాలా సమయం పట్టింది. మృతుల సంఖ్యను కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. చీకటిపడటంతో సహాయచర్యలు నిలిచిపోయాయి.  సుకుమా, జగదల్‌పూర్‌ ప్రాంతాల నుంచి వచ్చిన అదనపు బలగాలు కూంబింగ్‌ చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాడి కేసు ఎన్‌ఐఏకి : షిండే
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నాయకులపై మావోయిస్టుల దాడి కేసును నేషనల్‌ ఇన్వెష్టిగేటింగ్‌ ఏజెన్సీ ఎన్‌ఐఏకి అప్పగిస్తామని కేంద్రం హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. ఆయన మావోయిస్టులపై దాడిపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.