అభివృద్ది నినాదమే మర్మోగింది
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వేరు.. ఆ తరవాత జరిగిన పార్లమెంట్ ఎన్నికుల వేరు.. ఇప్పుడు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక వేరు..ఫలితం అందరూ అనుకున్నట్లుగానే టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చింది. ఇందులో రెండో అనుమానానికి తావు లేకుండా టిఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్న తరుణంలో ప్రజలు టిఆర్‌ఎస్ అబ్యర్థిని గెలిపించడం చూస్తుంటే …ఉప ఎన్నికల్లో జరిగే సాధారణ ఫలితమే వచ్చింది తప్ప అద్భుతం ఏవిూ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపిగా గెలవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే అభ్యర్థిగా తన భార్య పద్యావతికి టిక్కెట్ ఇప్పించుకుని రంగంలోకి దిగడంతోనే కాంగ్రెస్ ఓటమి ఖరారయ్యింది. ప్రజలు వారసత్వ రాజకీయాలను సహించే స్థితిలో లేరని తేలిపోయింది. భర్త లేకుంటే భార్య అన్న విధానానికి ప్రజలు తిరస్కరించారు. గత ఎన్నికల్లో కోదాడలో ఓడిపోయిన పద్మావతిని కాకుండా మరో అభ్యర్థిని కాంగ్రెస్ రంగంలోకి దింపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇకపోతే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్‌ఎస్,పార్టీ శ్రేణులన్నీ నెలరోజులుగా అక్కడే మకాం వేసి ప్రచారం చేయడం కలసి వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా ఉప ఎన్నిక కావడంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో టిఆర్‌ఎస్‌కు కలసి వచ్చింది. దీనికితోడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు అక్కడే మకాం వేసి ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014 ఎన్నికల్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ఆ ఎన్నికల్లో అందరూ తెలంగాణ సెంటిమెంట్ కారణంగా కెసిఆర్ విజయం సాధించి తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం అభివృద్ది నినాదంగా జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయదుందిభి మోగించింది. తరవాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే నినాదంగా మారింది. సిఎం కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. హుజూర్‌నగర్‌లో విజయం దక్కేలా వ్యూహాలు పన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలయ్యాక అనేకమంది కాంగ్రెస్,టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్, బిజెపిలు పదేపదే తమదే గెలుపు అంటూ, లెక్కులు చెబుతున్నా, గత అసెంబ్లీ అనుభవాలు మళ్లీ రిపీట్ కానున్నాయన్న భావన ప్రజల్లో కనిపించింది. ఎన్నికలు ఎప్పుడైనా గెలుపు తమదేనని టిఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేయడమే గాకుండా సవాల్ చేసి గెలిపి చూపారు. ప్రజలకు తమ ప్రభుత్వ పాలనపై పూర్తి నమ్మక మున్నదని.. పార్టీ నేతలు ఈ సందర్భంగా స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇక సెంటిమెంట్ పని అయిపోయింది. ఇప్పుడంతా అభివృద్ది నినాదంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. పునర్నిర్మాణం ఇతర పార్టీలకు రాజకీయమని, టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం అదొక టాస్క్ .. ఒక యజ్ఞం.. పవిత్రమైన కార్యక్రమమని గతంలో కెసిఆర్ పదేపదే ప్రకటించారు. ప్రతిపక్షం పదేపదే తప్పుడు ఆరోపణలు, దుష్పచ్రారాలు చేయడం కూడా కలసి వచ్చిందనే చెప్పాలి. ప్రజలు కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్‌ను ఆదరించాలనుకున్నారు. అలాగే హుజూర్‌నగర్‌లో అధికార పార్టీ అభ్యర్తి ఉంటే మంచిదన్న ప్రచారం కూడా కలసి వచ్చింది. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి ఉంటే అభివృద్ధికార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్లవచ్చన్న నినాదం కూడా బాగా పనిచేసిందనే చెప్పాలి. తెలంగాణలో అమలవుతన్న పథకాలకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అమలు చేసిన, అమలు చేస్తున్న పథకాల ద్వారా అభివృద్ది శరవేగంగా సాగుతోందన్న భరోసా ప్రజల్లో ఏర్పడింది. రాష్ట్రంలో మానవీయ కోణంలో అన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. వచ్చే
రెండేండ్లలో రాష్ట్రంలో ఎటుచూసినా ఆకు పచ్చగానే కనబడుతుందని 2020 జూన్ కల్లా ఎటుపోయినా పచ్చని పంట పైరుతో తెలంగాణ వ్యవసాయ రంగం రూ.లక్ష కోట్ల విలువైన పంట దిగుబడిని సాధిస్తుందని కెసిఆర్ పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు రాజకీయాల కోసం, ఓట్ల కోసం పెట్టినవి కావని కూడా కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పెడుతున్నవి తమాషా స్కీంలు కావు. పేదల బాధ నుంచి వచ్చిన పథకాలు. పేదలు ఎక్కడ ఉన్నా పేదలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రకులాల్లో ఉన్న పేదవారికి కూడా కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నా మంటూ వడమర్చారు. నిజానికి ప్రజలు కూడా ఈ పథకాల ఫలితాలు అందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల రాష్ట్రం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 85 శాతం మంది ఉన్నారు.. అగ్రవర్ణాల్లో ఐదు శాతం పేదలున్నారు. వీరందరు కలిస్తే 90 శాతం పేదలు ఉన్న రాష్ట్రం. కల్యాణలక్ష్మి అగ్రకుల పేదలకు కూడా ఇస్తున్నాం. ఇండ్లు లేనివారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. వ్యవసాయానికి 24 గంటల నిరంత రాయ విద్యుత్ సరఫరా చేయడంతోపాటుగా అన్ని వర్గాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని ఇవ్వబోతున్నారు. ఇలా పథకాలను పక్కాగా అమలు చేయడం,వాటి ఫీడ్ బ్యాక్ రావడం వల్ల కెసిఆర్ ధీమాగా ఉన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తమకు అధికార పార్టీ అభ్యర్తి ఎమ్మెల్యేగా ఉంటే మంచిదని భావించారు. అందుకే ఇక్కడి ఉప ఎన్నికలో అధికార అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి విజయం ఖాయమయ్యింది.