అభివృద్ధి సంక్షేమం సీఎం కేసీఆర్ లక్ష్యం

అడుగడుగునా అడ్డుకుంటున్న కేంద్రం
* పొలిమేర రోడ్డు అభివృద్ధి ఒక చరిత్ర
* వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్

జూలూరుపాడు, అక్టోబర్ 21, జనంసాక్షి:
కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రాములు నాయక్ అన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. మండల పరిధిలోని వినోబానగర్, గుండెపుడి, కాకర్ల, మాచినేనిపేట, దండుమిట్టతండాz రాజారావుపేటz పాపకొల్లు గ్రామాల్లో పలు పథకాల కింద కేటాయించిన నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డు నిర్మాణాలను ఎమ్మెల్యే రాములు నాయక్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాపకొల్లు గ్రామ కూడలిలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన పయనిస్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన అభివృద్ధి నిధుల వాటాను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాల్సి వస్తుందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక పథకాలతో సాగునీరు, తాగునీటితో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను బలోపేతం చేశారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, దళిత బందు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు విజయంపై పగటి కలలు కంటున్నాయని అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు టిఆర్ఎస్ విజయంలో విజయ రహస్యమని తెలిపారు. వైరా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలూరుపాడు వెంగన్నపాలెం గ్రామాల మధ్యన ఉన్న చరిత్ర కలిగిన పొలిమేర రోడ్డు అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులతో సుమారు 60 లక్షలకు పైగా విధులు వెచ్చించి కిలోమీటర్ మేర సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. పొలిమేర రోడ్డు అభివృద్ధికి నోచుకోవడం కూడా ఒక చరిత్ర అని అన్నారు. ప్రజా సహకారంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న. తనకు మరింత సేవ చేసేందుకు అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ సత్యనారాయణ, మండల ఇంజనీర్ నాగేందర్, ఆర్ అండ్ బి ఇంజనీర్ లఖన్ నాయక్, ఎండిఓ రవి, ఎంపీటీసీలు పొన్నెకంటి సతీష్, స్వాతి, సర్పంచులు పలువురు ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.