అమరవీరుల కుటుంబాల్ని ఆదుకునేందుకు నిర్ణయం
కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం,ఇంటికో ఉద్యోగం
వ్యాక్సిన్ పరిశ్రమకు ప్రోత్సాహం :సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి21(జనంసాక్షి): ‘అమరవీరుల’ తెలంగాణ అమరవీరుల కుటుంబాల విషయంలో ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దాంతోపాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ఆదుకోవాలని, వాళ్లకు తగిన ఆర్థికసాయంతో పాటు ప్రభుత్వోద్యోగాలు కూడా ఇవ్వాలన్న డిమాండ్లు చాలాకాలంగా ఉన్నాయి. ఇంతకుముందు బడ్జెట్లో కూడా దీనికి కేటాయింపులు జరిగాయి. అయితే.. అప్పట్లో అమరవీరుల సంఖ్య విూద, వారికి ఇస్తామన్న మొత్తం విూద ఇంతకు ముందు పలు విమర్శలు, వివాదాలు తలెత్తాయి. దాంతో ఈ అంశాన్ని సమగ్రంగా సవిూక్షించిన తర్వాత కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకుని, ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, కలెక్టర్లు ఈ విషయాన్ని సవిూక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలని తెలిపారు. ఒకవేళ అమరవీరుల కుటుంబ సభ్యులు తమలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం వద్దంటే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల రూ.పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడతలో గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు పదిలక్షల రూపాయల చొప్పున ఆర్ధికసహాయం అందించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని కోరారు. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి అమరవీరుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం,బీడి కార్మికుల భృతి,ఫార్మసీ పరిశ్రమకు చేయుత తదితర అంశాలపై సవిూక్షించారు. మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్ధిక శాఖ కార్యదర్శులు నాగిరెడ్డి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించాలని, ప్రతిపాదనలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యులకే వదిలిపెట్టాలని, ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి ఎవరూ అర్హులు లేకున్నా,ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాపారం చేసుకుంటే అందుకు ఆర్ధిక సహకారం అందించాలని, వ్యవసాయ చేసుకుంటామంటే వారికి భూమిని సమకూర్చాలని చెప్పారు. ఇంకా సదరు కుటుంబ సభ్యులు తమ కుటుంబం నిలబడడానికి ఏమి కోరుకుంటారో దానిపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో ఉన్న అమరవీరుల కుటుంబాల జాబితా ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి సంబందించి ఏమి కావాలనే విషయంపై స్వయంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్ధిక సాయాన్ని ఏమాత్రం జాప్యం లేకుండా అందించాలని చెప్పారు. ఇందుకు సంబందించిన డబ్బులు కూడా వెంటనే కలెక్టర్ల వద్ద పెట్టాలని ఆర్ధిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
వ్యాక్సిన్ పరిశ్రమకు ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తులకు ప్రభుత్వం కావాల్సిన ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి మెమొరాండం సమర్పించారు. దేశంలో ఏడాదికి రూ.4500 కోట్ల విలువైన వ్యాక్సిన్లు తయారవుతుంటే అందులో తెలంగాణలోనే రూ.3వేలకు పైగా వ్యాక్సిన్లు తయారవుతున్నాయని వరప్రసాద్‌రెడ్డి అన్నారు.దేశంలో వ్యాక్సిన్ల తయారీలో ఆరు ప్రముఖ కంపెనీలు భాగస్వాములైతే అందులో తెలంగాణవే నాలుగున్నాయన్నారు. హైదరాబాద్ నగరం వ్యాక్సిన్ల తయారికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని వివరించారు. ఈపరిశ్రమను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ల ప్రమాణాలను పరీక్షించాడానికి కావాల్సిన ల్యాబులు మాత్రం తెలంగాణలో అందుబాటులో లేవని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలిలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబరేటరీకి పంపాల్సి వస్తుందని చెప్పారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ల్యాబ్ పెడతామని, ఇందుకు అవసరమైన భూమి, ఆర్ధిక సాయం అందిస్తామని హావిూ ఇచ్చారు. హైదరాబాద్లో ల్యాబ్ పెట్టడం వల్ల తెలంగాణకే కాక, దక్షిణ భారత దేశానికి చెందిన రాష్టాల్రకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.