అమరుడా.. జోహార్‌..!

2
తలవంచి తెలంగాణ శ్రీకాంత్‌కు నివాళ్లు

నల్గొండ, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : పరాయి పాలననుంచి తెలంగాణ విముక్తి కోరుతూ ప్రాణాలను తృణప్రాయంగా వదిలాడు ఆ వీరుడు. స్వరాష్ట్రం కోసం చేసిన వీర పోరాటంలో అసువులు బాసిన అమరవీరుడు శ్రీకాంత్‌కు తెలంగాణ ప్రజానీకం తలవంచి నివాళ్ళర్పించింది. నిలువెల్లా కాలిన గాయాలతో మృత్యువుతో పోరాటం చేస్తూ తెలంగాణ బతుకుల్లో ఉద్యమ స్ఫూర్తి నింపేలా తెలంగాణను నినదించిన తెలంగాణ అమరుడు శ్రీకాంత చారి ఆత్మబలిదానం చేసుకొని నేటికి ఐదేళ్లు. ఆనాడు అస్తమించినా.. ప్రత్యేక ఉద్యమ ప్రతి ఘట్టంలోనూ ఆత్మగా నిత్యం ఉదయిస్తూనే ఉన్నాడు. ఆ ఉద్యమ స్ఫూర్తిని నరనరాల నింపుతూ వచ్చాడు. ఇప్పుడు పొడిచేడు ముద్దుబిడ్డ కల నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. శ్రీకాంత్‌.. భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ, ఆ త్యాగం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. శ్రీకాంతాచారి… ఆ పేరు వింటేనే తెలంగాణ ప్రజల గుండె బరువెక్కుతుంది. ఉద్యమంలో అలసిన ప్రతి సారీ రోమాలు నిక్కపొడుచుకొని, మళ్లీ కదన రంగంలోకి దూకే నూతన శక్తినిచ్చింది. అంతటి మహాత్యాగంతో పుట్టిన గడ్డ కోసం తనువు చాలించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ఉద్యమ సారథులను ఒక్కతాటిపైకి తెచ్చాడు శ్రీకాంతాచారి. తన ఆత్మార్పణతోనైనా సీమాంధ్ర పాలకులకు కనువిప్పు కలగాలన్న శ్రీకాంత్‌ కోరిక నెరవేరింది. రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడి సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధన దిశగా పయనిస్తోంది. శ్రీకాంతాచారి మిగతా ఆశయాన్ని నెరవేరుస్తోంది. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటాచారి,శంకరమ్మల పెద్ద కుమారుడు శ్రీకాంతాచారి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు(ఆగస్టు15)న పుట్టిన శ్రీకాంత్‌ తెలంగాణ స్వాతంత్య్రం కోసం తనువు చాలించాడు. ఇంట్లో అందరి పిల్లల్లాగే ఆడుతూ, పాడుతూ చలాకీగా ఉండేవాడు. ఆటల్లో, డ్యాన్సుల్లో అన్నింటా అతనిదే పైచేయి. ఎవరు సాయం కోరినా కాదనేవాడు కాదు. తాను కలలుగన్న తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన శ్రీకాంతాచారి ఎందరిలోనో ప్రత్యేక జ్వాలాలు రగిలించాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాదు వెళ్లిన శ్రీకాంత్‌ మొదట బీజేపీ, అనంతరం టీఅర్‌ఎస్‌లో క్రియాశీలక కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపించేవాడు. సెలవుల్లో ఇంటికొచ్చినా తెలంగాణ ధ్యాసే.. అవే పాటలు పాడుతూ, తెలంగాణ నినాదాలు చేస్తూ, కవితలు రాస్తూ ఉండేవాడు. తెలంగాణ అతని ఊత పదమైంది. ఈ క్రమంలో తెలంగాణ కోసం టీఅర్‌ఎస్‌ అధినేత కేసీఅర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శ్రీకాంత్‌లో ఉద్యమావేశాన్ని నింపింది. నాడు తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వ దమనకాండ, అరెస్టులకు తట్టుకోలేక పోయాడు. ఆ ఉద్వేగంలో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావుతోనైనా ఈ మొండి ప్రభుత్వంలో చలనం తేవాలనుకున్నాడు. 2009 నవంబర్‌ 29న హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో కేసీఅర్‌ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నా కార్యక్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతవుతూ జై తెలంగాణ అంటూ నినందించాడు. నీవైనా న్యాయం చేయమంటూ అంబేద్కర్‌ విగ్రహాన్ని వేడుకున్నాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియాతో పాటు, చివరకు డీఆర్డీఏ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్‌ 3న రాత్రి 10:30 గంటలకు తుది శ్వాస విడిచాడు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ తెలంగాణ స్మరణ చేశాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమన్నాడు. కాగా, తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో బూడిదవుతుంటే నాలుగు కోట్ల ప్రజల గుండెలు అవిశిపోయాయి. అందరినీ తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యేట్లు చేశాయి. శ్రీకాంత చారి  కుటుంబానికి అండగా నిలవడమే కాదు.. అమరులందరినీ ఆదుకుని, ఆసరా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆయన ఆశయ సాధనకు బాటలు పరిచి, ముందు నడిచిన శ్రీకాంతాచారి వంటి వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర సాధనతో అమరుల ఆశయం పూర్తిగా కాదు.. సగమే నెరవేరిందంటూ సుభిక్షమైన తెలంగాణ సాధించినప్పుడే పూర్తి ఆశయం నెరవేరినట్లని ప్రభుత్వ పెద్దలు ముందుకు నడుస్తున్నారు. అమరుల స్ఫూర్తితో తెలంగాణలో ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణకు బాటలు వేయాలి. అప్పుడే అమరుల త్యాగానికి మరింత సార్ధకత చేకూరుతుంది.