ఎస్సారెస్పీ-2కి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు
` ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో తెస్తామన్నారు.
` నల్గొండకు గోదావరి జలాలను తెచ్చిన ఘనత ఆయనదే..
` తుంగతుర్తి ప్రజల కోసం దామన్న పనిచేశారు
` ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అధిష్ఠానం అండగా ఉంటుంది
` వారి కుటుంబ సభ్యులకు రాజకీయంగా అవకాశం ఇస్తాం
` ఈ విషయం స్వయంగా సోనియా గాంధీయే చెప్పారు
` మాజీ మంత్రి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
తుంగతుర్తి (జనంసాక్షి)నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ-2కి ఆర్‌డీఆర్ (మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి) అని నామకరణం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో తెస్తామన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దామన్న నిలబెట్టారు. ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సారెస్పీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. తుంగతుర్తి ప్రజల కోసం దామన్న పనిచేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అధిష్ఠానం అండగా ఉంటుందని సోనియా గాంధీ చెప్పారు. ఆయన కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తాం. దామన్న మృతి పట్ల సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. కష్టకాలంలో కూడా తాను నమ్మిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో పాల్గొని ఆర్డీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేయడంతోపాటు ఈ ప్రాంత రైతాంగానికి గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామల చేయాలని ఉద్దేశంతో లక్షలాది మందితో రక్తతర్పణ కార్యక్రమం నిర్వహించారని అన్నారు.నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి తుంగతుర్తి ప్రాంత రైతాంగానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.దామోదర్ రెడ్డి మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు.తన జీవితకాలమంతా ప్రజలకే సేవ చేశారని అన్నారు. ఆర్డీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన 40 సంవత్సరాల కాలంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన ఆయన వారసత్వంగా వచ్చిన ఆస్తులు మొత్తం ప్రజల కోసం ధారపోశారని అన్నారు.కక్షలు కార్పన్యాలు ఉన్న తుంగతుర్తి ప్రాంతంలో వాటన్నింటిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారని అన్నారు.ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూనే,మరోవైపు సాగునీరు లేక ఎడారిలా మారిన తుంగతుర్తి ప్రాంతానికి ఎస్సారెస్పీ నీళ్లు తేవడానికి అనేక ఉద్యమాలు సాగించాడని అన్నారు.తమ ప్రాంతంకు గోదావరి జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంత రైతాంగానికి అందించాలని ముందుకు కదిలారని, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు.ముఖ్యంగా రిజర్వేషన్లపరంగా తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీకి మారడంతో పక్కనే ఉన్న సూర్యాపేటకు వెళ్లినప్పటికీ తుంగతుర్తి ప్రాంతాన్ని ఏనాడు మర్చిపోలేదని అన్నారు.తుంగతుర్తి ప్రాంతంలో దామోదర్ రెడ్డి వేసిన బీజం వల్లనే మందుల సామేలు 50 వేల మెజార్టీతో తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు.రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ముందుండేవారని అన్నారు.ఆయన సోదరుడు దివంగత వెంకటరెడ్డి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి సుజాతనగర్ నియోజకవర్గం నుండి గెలుపొందారని అన్నారు. ఇద్దరు సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ తమ తుది శ్వాస వరకు కాంగ్రెస్ జెండాను మోసారని అన్నారు.దామోదర్ రెడ్డి మృతి పట్ల ఏఐసీసీ కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిందని తెలిపారు.దామోదర్ రెడ్డి మృతి సంతాప సందేశాన్ని రాహుల్ గాంధీ పంపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని తమతో చెప్పారని అన్నారు.భవిష్యత్ రాజకీయాలలో ఆయన కుమారుడు సర్వోత్తమ రెడ్డికి అండగా ఉంటామని చెప్పారు.అంతకు ముందు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వి.హనుమంతరావుతో పాటు పలువురు నేతలు ఎస్సారెస్పీ ఫేజ్ -2 కు దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడంతో పాటు వినతిపత్రం సమర్పించారు. దీంతో స్పందించిన సీఎం శ్రీరామ్ సాగర్ రెండో దశ ప్రాజెక్టుకు దామోదర్ రెడ్డి పేరును నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. 24 గంటల్లోగా దీనికి సంబంధించిన జీవో జారీ చేస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు.ఆయన తన ఆరోగ్యం, వయసును సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే స్వభావం కలవారని అన్నారు.ఆయన మృతితో ఈ ప్రాంతం గొప్ప కాంగ్రెస్ నాయకుడిని కోల్పోయిందని, ఆయన మృతి దురదృష్టకరమని పేర్కొన్నారు.ఆర్డీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, బాలు నాయక్, రామచంద్రనాయక్, రాగమయి దయానంద్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి,రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, సిపిఐ ఎమ్మెల్యే కె.సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, చకిలం రాజేశ్వరరావు, గుడిపాటి నరసయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పోతు భాస్కర్ తోపాటు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.