సరిగ్గా వాదనలు వినిపించలేదనుకుంట!

` కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో నేను ఏం చేయగలను
` సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు
` మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం::కిషన్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘‘ కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు. మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ.. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టులో.. రిజర్వేషన్లకు 50శాతం క్యాప్‌ పెట్టిందే కాంగ్రెస్‌ ప్రభుత్వం హాయంలోనే. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 50శాతం క్యాప్‌నకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో విఫలమైంది. ఇప్పుడు హైకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. బీసీ రిజర్వేషన్ల కోసం భాజపా పూర్తి మద్దతు ఉంటుంది. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి కోసం 3 పేర్లను జాతీయ పార్టీకి పంపించాం. పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉటుంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.