అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదాం – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 21( జనంసాక్షి): పోలీసు ఉద్యోగ నిర్వహణ ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, అదే సమయంలో ఎంతో క్లిష్టమైనదని అలాంటి విధి నిర్వహణలో భాగంగా తమ జీవితాలను పణంగాపెట్టి విద్యుత్ ధర్మ నిర్వహణలో పోలీసు వ్యవస్థ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తున్నారని అలాంటివారి ప్రాణత్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని పోలీసులంతా ముందుకు సాగాలని సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో నెలకొని ఉన్న అమరవీరుల స్మారక స్తూపానికి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బలిపీఠం ఎక్కిన పోలీసు అధికారుల త్యాగనిరతిని ఎవరూ మరువకూడదని, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండదండలు అందించాల్సిన బాధ్యతను సిపి గుర్తుచేశారు. ప్రస్తుత పోలీసు ఉద్యోగులంతా కత్తి మీద సాము లాంటి విధి నిర్వహణను బాధ్యతాయుతంగా చేపడుతూ జాతిసేవకు పునరంకితం కావాలని ఆయన పునరుద్గాటించారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచికోసం ప్రాణత్యాగాలుచేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో భాగంగా దేశభద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులదేనన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారని సిపి గుర్తు చేశారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలనుసైతం పణంగా పెడతానని, ప్రతి పోలీస్‌… విధుల్లో చేరినప్పుడు ప్రమాణం చేస్తారని, పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే విధులు నిర్వర్తించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందినవారు ఎంతోమంది ఉండడం గర్వకారణమన్నారు. పరిరక్షణకోసం నిరంతరం ప్రజలకోసం జీవించి, మరణించే పోలీసులకి, ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలకోసం పోలీసుచేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు.
కొత్తగా పోలీసు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 264 పోలీసులు విధి నిర్వహణలో అరులయ్యారని వారందరికీ,జోహార్లని సిపి తెలిపారు. అమరులమరణం వారి కుటుంబసభ్యులకు తీరనిలోటని, చనిపోయిన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే డిపార్ట్ మెంట్ పోలీసులు కాబట్టి పోలీసులకు ఎప్పుడూ అన్నివర్గాల ప్రజలు సహకరించాలన్నారు.
1959 ఇండో-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారన్నారు. అలాగే 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారని తెలిపారు.
అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ మరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈసంవత్సరం అమరులైనవారి పేర్లను/ రోల్ ఆఫ్ హానర్ ను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ (సీఎస్డబ్ల్యూ) ఏసీపీ ధనలక్ష్మి చదివారు. ఇందులో భాగంగా విధినిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆమన్గల్ ఎస్ఐ కే హనుమంత్ రెడ్డి, తలకొండపల్లి పోలీస్ కనీస్టేబుల్ ఫహీముద్దీన్, ఆర్మేడ్ కనిస్టేబ్లుల్ ఈశ్వర్ రావును సేవలను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ శాలువాకప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ గారు మాట్లాడుతూ.. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉందన్నారు.
దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే మొదలైందని, మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలు నిర్వర్తింప చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి శ్రీనివాస్ రావు, మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి కవిత, సైబర్ క్రైమ్ ఏడిసిపి రితిరాజ్, అడ్మిన్ డిసిపి ఇందిర, ఏడీసీపీ రవి కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏడిసిపి వెంకట్ రెడ్డి, ఎస్ఓటి ఏడిసిపి నారాయణ, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, వివిధ సెక్షన్ల సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.