అమర జీవి, ప్రజాకవి,ప్రజాగాయకుడు సుద్దాల హన్మంతు

మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పల్లెపల్లెకు పాటై ప్రవహించి, తన గొంతుకను పాటల తూటాగా మలచి ప్రజాశక్తులను ఐక్యం చేసి, ఉద్యమాల బాట పట్టించిన గొప్ప రచయిత, గాయకుడు సుద్దాల హన్మంతు అని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు అన్నారు. సోమవారం ఆయన వర్ధంతి పాలడుగు గ్రామంలో సీపీఎం పార్టీ గ్రామ శాఖ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. జానపదుల భాష, యాసలను బాణీలుగా మలచి పాటలో  బతుకు పరిష్కారం చూపిన గాయకుడు సుద్దాల హన్మంతు అని, ఆయన మోత్కూరు  మండలం  పాలడుగు  గ్రామంలో 1910 లో నిరుపేద చేనేత కుటుంబంలో గుర్రం బుచ్చిరాములు, లక్ష్మినరసమ్మ దంపతులకు జన్మించాడు. హన్మంతు అసలు ఇంటి  పేరు గుర్రం. జీవన పోరాటంలో భాగంగా ఆయన గుండాల మండలం సుద్దాల గ్రామంలో స్థిరపడటంతో ఆ ఊరి పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. సుద్దాల హన్మంతు నిజాం నిరంకుశ పాలనపై పోరాడే, ప్రజల పక్షాన నిలబడి, తన పాటలతో ప్రజాఉద్యమాలకు  ఊపిరి పోసిన, ప్రజాకవిగా, ప్రజల హృదయాలలో నిలిచారని. ప్రజల దోపిడీ, పీడనకు కారమైన  ఆనాటి  నిజాం ప్రభుత్వం లో  జాగీర్దారి, జమీందారి,  వ్యవస్థ అనుసరిస్తున్న, వెట్టి చాకిరి విధానానికి  వ్యతిరేకంగా,భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం సమసమాజ స్థాపనే లక్ష్యంగా సాగాలంటూ తన  కలాన్ని  ఝళిపించారు. ‘ప్రజా ప్రభుత్వం, సాధిస్తాం. నిజాం నిరంకుశన్ని  నిర్మూలించి, గ్రామ  గ్రామాన  ఎర్ర జెండా ఎగరేస్తం’ అంటూ తన పాటలతో పాలకుల  వెన్నులో చలిపుట్టించిన  తొలి ప్రజావాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు.  సుదీర్ఘ కాలం కమ్యూనిస్ట్ నాయకునిగా ప్రజాపోరాటాల్లోనే  తన జీవితాన్ని గడిపిన  హన్మంతు గారు,  తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిరంతం పాలకుల పై యుద్ధభేరిని మ్రోగించిన ప్రజాగొంతుక సుద్దాల గ్రామంలో 1982 అక్టోబర్ 10న మూగబోయింది. జీవితమంతా పీడిత ప్రజల చైతన్యం  కోసం గొంతెత్తి పాడిన సుద్దాల హనుమంతు జీవితాన్ని నేటి  ఆధునిక సాహిత్యకారులు ఆదర్శంగా తీసుకొని, నేటి పాలకుల ప్రజా వ్యతిరేక  విధానాలపై, ప్రజలను  చైతన్యం చేయవలసిన అవసరం ఉందని ఆన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, శాఖ సహాయ కార్యదర్శి చింతకింది సోమరాజు, వడ్డేపల్లి లక్ష్మణ్, కొంపల్లి గంగయ్య, పవన్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.