అమెరికాలో కేటీఆర్ బిజీబిజీ
– కాలిఫోర్నియా గవర్నర్‌తో భేటి
శాన్ ఫ్రాన్సిస్కో,జూన్ 2(జనంసాక్షి): మెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్న మంత్రి కేటీ రామారావు కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో సమావేశం అయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సాంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు ఉన్న విస్తృత అవకాశాలను మంత్రి సేల్స్ ఫోర్స్ బృందానికి వివరించారు.ప్రపంచంలోని 13 ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశం నుంచి తెలంగాణ రాష్టాన్రికి మాత్రమే ఆహ్వనం దక్కింది. ఈ సమావేశంలో తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గవర్నర్ తో భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీల ప్రధాన అంశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తొలుత శాన్ ఫ్రాన్సిస్కోలోని సాఫ్ట్ వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి బృందంతో కేటీఆర్ సమావేశం అయ్యారు. మధ్యాహ్నం లిక్డ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్ మన్‌తో మంత్రి సమావేశం అయ్యారు. భారతదేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళికలను మంత్రి తెలుసుకున్నారు. కంపెనీ ప్రణాళికల్లో తెలంగాణకు ప్రధాన స్థానం కల్పించాలని కోరారు. హైదరాబాద్‌లో డేటా సెంటర్లు, డేటా ఎనలిటిక్స్ ఆపరేషన్స్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. హైదరాబాద్ నగరానికి హాఫ్ మన్‌ని అహ్వనించారు. మంత్రి ఆహ్వానాన్ని అంగీకరించిన హాఫ్ మెన్, వచ్చే ఏడాది కంపెనీ ప్రతినిధి బృందంతో హైదరాబాద్ నగరంలో పర్యటిస్తామని హావిూ ఇచ్చారు.