అమెరికాలో చరిత్ర సృష్టించిన మన బుడతడు

స్పెల్లింగ్‌ బీ పోటీల్లో విశ్వ విజేత అరవింద్‌
వాషింగ్టన్‌, (జనంసాక్షి) :
అమెరికాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారతీయ అమెరికన్‌ విద్యార్థి అరవింద్‌ మహంకాళి చరిత్ర సృష్టించాడు. వరుసగా ఆరోసారి ఈ టైటిల్‌ గెలిచిన ఆరో ప్రవాస భారతీయుడిగా రికార్డులకెక్కాడు. స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీలను అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు. గురువారం రాత్రి జరిగిన 86 స్క్రిప్స్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో మహంకాళి జయకేతం ఎగురవేశాడు. గతంలో రెండు సార్లు మూడోస్థానంలో నిలిచిన అతడు ఈసారి నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబులు చెప్పి విజేతగా నిలిచాడు. గతంలో జెర్మన్‌ నుంచి వచ్చిన ఇంగ్లిష్‌లోకి వచ్చిన పదాలతో సరిగ్గా స్పెల్లింగ్‌ చెప్పలేక ఓడిపోయిన అతడు.. ఈసారి అదే జెర్మన్‌ పదాలకు సమాధానం చెప్పి గెలుపొందాడు. ఈసారి కూడా ఫైనల్లో చివరి ప్రశ్నగా జడ్జిలు జర్మన్‌ పదాన్నే సంధించగా తికమకపెట్టే జర్మన్‌ పదానికి ఎలాంటి తడబాటు లేకుండా కరెక్టుగా స్పెల్లింగ్‌ చెప్పి ట్రోఫీ ఎగురేసుకుపోయాడు. ముప్పై వేల డాలర్‌ ప్రైజ్‌మనీని కొట్టేశాడు. తనకు శాపంగా మారిన జర్మన్‌ పదాలు ఇప్పుడు వరంగా మారాయని అతడు పేర్కొన్నాడు. న్యూయార్క్‌కు చెందిన 13 ఏళ్ల అరవింద్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతడి పూర్వీకులది హైదరాబాదే. కింగ్‌ ఆఫ్‌ ఆల్‌ సైన్సెస్‌గా పిలవబడే ఫిజిక్స్‌లో తన భవిష్యత్తు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు మహంకాళి తెలిపాడు. స్పెల్‌బీ ఇక రిటైర్డ్‌ ప్రకటించినట్లేనని తన దృష్టంతా ఇక ఫిజిక్స్‌పైనేనని చెప్పాడు. తన తండ్రి తెలుగు పద్యాలను వెనుక నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కు చెప్పే వారని అది ఈ పోటీల్లో చాలా ఉపయోగపడిరదని పేర్కొన్నాడు. చాలాకాలంగా స్పెల్సింగ్‌ పోటీల్లో భారతీయులదే ఆధిపత్యం కొనసాగుతోంది. మూడ్రోజుల క్రితం ప్రారంభమైన స్పెల్‌ బీ పోటీల తుది జాబితాలో 45 మంది విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. వాఇరలో 15 మంది భారతీయ విద్యార్థులే కావడం గమనార్హం. ఈ పోటీల్లో గత ఆరేళ్లుగా వరుసగా భారతీయ విద్యార్థులే విజేతలుగా నిలుస్తూ భారత కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారు. 1999 నుంచి గత పదిహేనేళ్లలో 11 సార్లు భారతీయులే ట్రోఫీని దక్కించుకున్నారు.