అమ్మవారి దర్శనానికి వెళుతుండగా ఘోర ప్రమాదం
టూ వీలర్‌ను ఢీకొన్న టిప్పర్
చిన్నారి మృతి..ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు
ఆందోళనకు దిగిన గ్రామస్థులను వారించిన పోలీసులు
విశాఖపట్టణం,అక్టోబర్8 (జనంసాక్షి) : ఇన్నాళ్లూ ఆనందమే గానీ విషాదం తెలీని కుటుంబం వారిది.. భార్యాభర్తలు, వారికి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు.. అంతా సవ్యంగా సాగిపోతున్న పండంటి జీవితం.. క్షణాల్లో ఛిన్నాభిన్నమైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మరో గంటలో భవాని మాలలు ధరించి దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ కుటుంబానికి లారీ రూపంలో విషాదం ఎదురైంది. మునగపాక గ్రామానికి చెందిన దొడ్డి శంకర్ గణెళిష్ బ్రాండిక్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గాదేవి మాలలు ధరించడంలో భాగంగా స్నానమాచరించేందుకు ద్విచక్ర వాహనంపై అచ్యుతాపురం మండలం పూడిమడకకు గురువారం తెల్లవారుజామున బయలుదేరారు. తిమ్మరాజుపేట మరిడిమాంబ గుడి సవిూపంలో అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వైపునకు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వారిని బలంగా ఢీకొంది. సంఘటనలో బైక్‌పై వెళుతున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శంకర్ గణెళిష్‌కు కాళ్లు, చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భార్య ఉషకు, కుమారుడు హర్షకు తీవ్ర గాయాలయ్యాయి. కూతురు యోతికి కూడా గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. మార్గంమధ్యలో హర్ష (5) మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు క్షతగాత్రులను కేజీహెచ్‌లో చేర్పించారు. శంకర్‌గణెళిష్, అతని భార్య ఉష పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పూడిమడక రోడ్డులో మునగపాక వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ యజమాని వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, జెడ్‌పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, సర్పంచ్ దిమ్మల అప్పారావు, సీపీఎం నేత మహేష్ తదితరులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన కారులకు మద్దతుగా నిలిచారు. అనకాపల్లి సీఐ శ్రీనివాసరావు పరిస్థితిని అదుపు చేయడానికి శ్రమించారు. ఈ విషయం తెలిసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హావిూ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఈ మార్గం విూదుగా అనుమతులు లేకుండా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. ప్రమాదాల నివారణకు ఇకపై నిత్యం పోలీసు గస్తీ ఉంటుందన్నారు.