అమ్మహస్తంపై దుష్ప్రచారం వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’పై వస్తున్న విమర్శలను పౌరసరఫరాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధంబాబు ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే అమ్మహస్తం పథకంపై దుష్పచ్రారం చేస్తున్నారని అన్నారు. అమ్మహస్తం పథకంలో చిన్నచిన్న లోపాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. వాటిని సరిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అమ్మహస్తం పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు వెల్లడించారు. గురువారం ఉదయం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అమ్మహస్తమో.. మాయ హస్తమో ప్రజలే తేలుస్తారన్నారు. అమ్మహస్తం పథకంలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమేనన్నారు. అయితే, కొందరు కావాలనే రాజకీయ దురుద్దేశం కోసం విమర్శలు చేస్తున్నారని, ప్యాకెట్లలో ఏవో వస్తున్నాయని ఆరోపిస్తున్నారని విమర్శించారు. ఇటీవల రేషన్‌ షాపులో సరఫరా చేసిన గోధుమ పిండిలో పిచ్చుక అవశేషాలు రావడంపై స్పందిస్తూ.. అమ్మహస్తం సరుకుల ప్యాకెట్లను చింపి ఏవేవో పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేషన్‌ డీలర్లు వేరే పార్టీ వారు ఉంటే ఇలాంటి పనులు చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి వాటికి అవకాశం లేదన్నారు. ఉంటే ఏవైనా నాణ్యతా లోపాలను ఉండొచ్చని, వాటిని సరిదిద్దుతామని చెప్పారు. ఒకవేళ నాణ్యతాలోపం ఉంటే వాటిని సవరించుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నాణ్యతాలోపాలను సరిదిద్దేందుకు క్వాలిటీ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమ్మహస్తం పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు వెల్లడించారు. మే, జూన్‌ నెలాఖరుకల్లా అమ్మహస్తం కార్యక్రమం లోపాలను సవరించుకొని నాణ్యమైన సరుకులు అందివ్వడమే తమ లక్ష్యమని, దీని కోసం థ్డం పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీలర్లు డీడీలు కట్టిన మేరకు రేషన్‌ సరుకులను సరఫరా చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.