అమ్ముల పొదిలో మరో అస్త్రం
– బరాక్ 8 క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ,డిసెంబర్30(జనంసాక్షి): భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే బరాక్-8 క్షిపణిని బుధవారం ఐఎన్‌ఎస్ కోలకతాపై నుంచి విజయవంతంగా ప్రయోగించారు. గగనతలంలోని ఎలాంటి శత్రు క్షిపణిని అయినా, యుద్ధ విమానాల్నైనా ధ్వంసం చేసే బరాక్-8 క్షిపణిని తొలిసారిగా భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతాపై నుంచి బుధవారం విజయవంతంగా ప్రయోగించారు. ఈ సరికొత్త క్షిపణి ప్రయోగం విజయవంతంపై భారత నావికాదళం సంతోషం వ్యక్తంచేసింది. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో ఓ మైలురాయి అని రక్షణ శాఖ వెల్లడించింది. దీని ద్వారా శత్రు దేశాల క్షిపణిలను ధ్వంసం చేసి మన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ఈ క్షిపణిని భారత నావికాదళం, డీఆర్‌డీఓ, ఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధ తయారీ సంస్థ సంయుక్తంగా రూపొందించారు. గతంలో పలు మార్లు ఇజ్రాయెల్ నుంచి దీనిని ప్రయోగించారు. భారత్‌కు అత్యాధునిక బరాక్-8 క్షిపణులను అందించడానికి ఇజ్రాయెల్ 2009 నవంబరులో 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బరాక్-8 క్షిపణి ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించగలదు.
క్షిపణి గురించి కొన్ని విషయాలు..
బరాక్-8 గగనతలంలోని శత్రువుల హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, క్షిపణులు, మానవరహిత ఏరియల్ వెహికిల్స్ క్రూయీజ్ మిసైల్స్, కాంబాట్ జెట్స్‌తో సహా వేటినైనా ధ్వంసంచేయగలదు.బరాక్ అంటే హిబ్రూ భాషలో మెరుపు అని అర్థం.బరాక్-1 క్షిపణిని ఇజ్రాయెల్ గతంలోనే తయారుచేసింది. దాని బరువు 98కేజీలు. బరాక్-1 క్షిపణులనూ భారత్ కొనుగోలు చేసింది.2009 జులైలో ఇజ్రాయెల్ బరాక్-2 క్షిపణిని అభివృద్ధి చేసింది.2009 నవంబరులో మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బరాక్-8 క్షిపణిని రూపొందించడానికి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుని డీఆర్‌డీవో భాగస్వామ్యంతో రూపొందించింది.బరాక్-8 బరువు 275కేజీలు. 60కేజీల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు.
4.5 విూటర్ల పొడవున్న ఈ క్షిపణి 70 నుంచి 90 కి.విూల దూరంలోని గగనతల లక్ష్యాలను ఛేదించగలదు. దీనిని నిలువుగా ప్రయోగిస్తారు. లాంగ్ రేంజ్, టూవే డేటా లింక్, యాక్టివ్ రాడార్ సీకర్ మిస్సైల్, 360 డిగ్రీల కవరేజీ, మల్టి సైమల్టేనియస్ ఎంగేజ్‌మెంట్స్ బరాక్-8 ప్రత్యేకతలు.బరాక్-8ను అత్యాధునిక సామర్థ్యం గల లాంగ్ రేంజ్ మిస్సైల్ డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా అభివర్ణిస్తున్నారు.బరాక్-8 తర్వాత బరాక్-8 ఈఆర్(ఎక్స్‌టెండెడ్ రేంజ్) క్షిపణిని తయారుచేస్తున్నారు. ఈ క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైతే మన సైన్యం మరింత బలోపేతమవుతుంది. గగనతలం నుంచి ప్రయోగించే శత్రు క్షిపణులను సైన్యం సమర్థంగా ఎదుర్కోగలదు.