*అయోడైజ్డ్ ఉప్పు ఆరోగ్యమైన జీవితానికి నాంది*

 జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం

మునగాల, అక్టోబర్ 21(జనంసాక్షి): జాతీయ అయోడిన్ లోప వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున జరుపుకుంటున్నట్లు తెలియజేశారు. మునగాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం మాట్లాడుతూ, బోధ వ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు. శరీరంలోని ఏ భాగానికైనా బోధ వ్యాధి రావచ్చు అని , ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మరియు డిఈసి మాత్రలు వేసుకోవడం ద్వారా 100% వ్యాధిని నివారించవచ్చని అన్నారు. పరిసరాల పారిశుధ్యం పాటించడం ద్వారా దోమల పెరుగుదలని నిరోధించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ మాత్రలు తప్పక మింగాలని , గ్రామాలలో పట్టణాలలో ఇంటి వద్దకు వచ్చే ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలకు సహకరించాలని అన్నారు. అయోడైజ్డ్ ఉప్పు ఆరోగ్యమైన జీవితానికి నాంది అని, అయోడిన్ లోపం వల్ల వ్యాధులు అన్ని వయసుల వారికి వస్తాయని అన్నారు. అయోడిన్ ఉప్పులోని అయోడిన్ ఆవిరి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అయోడైజ్డ్ ఉప్పు మూతను గట్టిగా పెట్టి ఉన్న డబ్బాలలో నిల్వ ఉంచవలెనని, తడి తేమ వేడికి దూరంగా ఉంచాలని అన్నారు. వంటకం తయారై దించిన తర్వాత అయోడిన్ ఉప్పును కలపాలని అన్నారు. ఊరగాయ పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలలో కూడా అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడాలని అన్నారు. అయోడిన్ నిత్యవసర సూక్ష్మ పోషక విలువకలదని, దీనిని కొద్ది పరిమాణంలో 150 ఎంజి రోజుకి తీసుకోవాలని కోరారు. అయోడిన్ కలిపిన ఉప్పు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, మంచి శారీరక మానసిక ఆరోగ్యం, సరైన పెరుగుదల, చురుకుతనం, ఉత్సాహం, మంచి జ్ఞాపకశక్తి, సంగ్రహణ శక్తి పెరగడం, సక్రమంగా గర్భస్థ శిశువు పెరుగుదల, చదువుల్లో  వయసుకు తగ్గ ప్రతిభ చూపించడంలాంటివి ఉంటాయని అన్నారు. అంతేగాక జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, అయోడిన్ లోపం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తాయని బుద్ధి మాంద్యం, మరుగుజ్జు తనం, చెవుడు మూగ వంటి వ్యాధులతో పిల్లలు పుడతారని అన్నారు. గర్భస్రావాలు మాతృ, శిశు జనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. మహిళలలో థైరాయిడ్ గ్రంధి పెద్దగా పెరగడం జరుగుతుందని అన్నారు. గొంతువాపు, అతి తక్కువ బరువుతో పుట్టే పిల్లలు, బుద్ధి మాన్యం, చదువులో ప్రతిభ సరిగ్గా చూపించలేకపోవడం ఇలాంటివి జరుగుతాయని అన్నారు. నిత్యం ఆహారంలో అయోడిన్ చేసిన ఉప్పును వాడడం వలన అయోడిన్ లోపం వలన కలిగే వ్యాధుల బారిన పడకుండా రక్షణ లభిస్తుందని అన్నారు. అయోడైజ్డ్ ఉప్పుని వాడాలని, దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా జీవించే హక్కుని మనం కాపాడవచ్చని అన్నారు.  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మునగాల పరిధిలో  జరుగుతున్న బోద వ్యాధి నివారణ కార్యక్రమాన్ని, బోధ వ్యాధి మాత్రల పంపిణీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వైద్యాధికారి డాక్టర్  కత్తి రవళి, డెమో అంజయ్య, భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు.