సేవా సుందరి…
అందం, మంచి మనసు కలబోసిన చోట..
తెలంగాణ బిడ్డకు ఖండాంతరాల ఖ్యాతి
సీమాంధ్ర మీడియాలో కరువైన చోటు
గుర్తింపునోచుకోని తెలుగు(తెలంగాణ)తేజం!
ఆమె ప్రపంచ పీఠభూముల మీద ఆత్మగౌరవ జెండాను ఎగరేసింది. మారుమూల తెలంగాణ పల్లె నుండి ఖండాంతరాలకు ఈ మట్టి ఖ్యాతిని మోసుకుపోయింది.అందాలను మార్కెట్ చేసుకోవడం తెలియదు తనకు. బాహ్య సౌందర్యం కన్నా.. అంతర్ సౌందర్యమే గొప్ప అన్నది ఆమె మాట! అందుకే ప్రపంచ దేశాల సుందరీమణుల మధ్య మేటిగా గెలుపొందింది!
తలమీద మెరుపుల కిరీటం వెలుగులు వెలిగినా…తన చుట్టూ ఇంటర్నేషనల్ కెమెరాలు జిగేల్ మన్నా…తన మూలాలను మరువలేదు. పదిమందికి మంచిని పంచాలనే తన సంకల్పాన్ని మరువలేదు. అందుకే అమెరికా నుండి తన ప్రయాణం వెనుకబడిన ఆఫ్రికా ఖండానికి సాగింది. ఘనా దేశంలో ఘనమైన సేవకు అంకితమైంది. అంతర్జాతీయంగా బాలల పరిరక్షణకోసం పనిచేస్తున్న యూనిసెఫ్‌లో క్యూసీ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఆవిడే ప్రత్యూష!
ప్రత్యూష ప్రతిభకు అంతర్జాతీయ సంస్థలు సైతం దాసోహమన్నాయి. బీఎంఐ అనే చారిటీ సంస్థ తనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.
ఇంతవరకు బాగానే ఉంది కాని…
తను పుట్టిపెరగిన నేల మీద ఈ సేవాసుందరి మీద అప్రకటితయుద్ధం ప్రకటించింది ఆంధ్రా మీడియా…
ప్రతిభలేని పాలక కులాలకు పెద్దపీటనేసే సదరు మీడియా, ప్రత్యూషను పట్టించుకున్న పాపాన పోలేదు.
పక్కరాష్ట్రంలో పనికిరాని పతకం కొడితే..తెలుగు తేజమో..తెలుగు తేజమని ఇల్లెక్కి కూసే ఆంధ్రా మీడియాకు ప్రత్యూష ప్రతిభ పట్టలేదు. ఏనాడూ కనీసం ఓ చిన్న వార్తను కూడా ప్రచురించడానికి మనసొప్పలేదు. ఇలా ఇందులేదు అందులేదనే సందేహం వలదు. ఎందెందు వెదికినా అందందే కలదన్నట్టు ఆంధ్రామీడియా పక్షపాతం మరోసారి బట్టబయలైంది.
తెలంగాణే అయినా ఎందుకు ప్రాచుర్యానికి నోచుకోవడం లేదో బహిరంగ రహస్యమే! ఔను మానవహక్కుల మహానేత బాలగోపాల్ ఓ సందర్భంలో అన్నట్టు ”భారతదేశంలో ఎవరి అభివృద్ధి అయినా వారి ప్రతిభ పై ఆధారపడిలేదు. వాళ్ళు ఏ కులంలో పుట్టారన్నదానిపైనే ఉంది”
అయినా సీమాంధ్ర మీడియా పక్షపాతం చూపినా..
తెలంగాణ మట్టిమనుషుల దిల్‌కా ధడకన్ జనం సాక్షి నిండుమనసుతో శుభాకాంక్షలు తెలుపుతోంది.
జనంసాక్షితో గొంతు కలిపి, ఈ మట్టిలో మాణిక్యాన్ని సగర్వంగా ఎలుగెత్తి చెప్పుకోవాడానికి ఖండఖండాంతరాల తెలంగాణ బిడ్డలు సదా సిద్ధమే…
”మట్టిలో ఉన్నా దాగదు మాణిక్యం విలువ
బురదలో ఉన్నా తగ్గదు తామర విలువ
తాటాకులో ఉన్నా తగ్గదు పద్యం విలువ
మూర్ఖులు ముంచుతున్నా మునగదు జ్ఞానం విలువ” అన్నాడు తెలంగాణ కవి సినారే. ఈ మాట ప్రత్యూష విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమే అవుతుంది.
హైదరాబాద్,జనవరి10(ఆర్‌ఎన్‌ఎ): ప్రత్యూష..పౌష్టికాహార లోపంతో వ్యాధులతో బాధపడుతూ కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం మీద మృతి చెందడం ఆమె మనసును కలచి వేసింది. ఈ పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్న ఉదాత్త లక్ష్యంతో సేవా కార్యక్రమాలను చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ ఆడబిడ్డ గూడూరు ప్రత్యూష. 1991 లో కరీంనగర్‌లో జన్మించిన ప్రత్యూష తల్లిదండ్రులు మంజుల, శ్రీనివాస్. మంజుల తల్లిదండ్రులు అనసూయ, సోమవెంకటయ్యలు కరీంనగర్ నివాసులే.. శ్రీనివాస్ వరంగల్‌కు చెందినవారు. శ్రీనివాస్ వరంగల్, హైదరాబాద్ నగరాల్లో ఎస్‌బిఐలో పనిచేశారు. 1999లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కుంగదీస్తున్న తరుణంలో ఈ కుటుంబం అమెరికాకు తరలి వెళ్లింది. అయిదో తరగతి వరకు హైదరాబాద్ ఆక్స్‌ఫర్డ్ స్కూలులో చదువుకున్న ప్రత్యూష 1999 లో అమెరికా లోని ఐఎస్ పబ్లిక్ స్కూలులో తరువాత క్వీన్స్‌కాలేజీలో విద్యాభ్యాసం సాగించారు. విద్యార్థినిగా ఉన్నప్పుడే ఇంత కీర్తి సాధించిన ప్రత్యూష మనోభావాలు తెలుసుకోడానికి ఈ ప్రతినిధి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నారు, దీనికి స్ఫూర్తి ఏమిటని ప్రశ్నించగా ‘ప్రపంచ పరిస్థితులే కారణం. పౌష్టికాహార లోపంతో అంటువ్యాధులతో సతమతమై, రోజూ 14 వేల మంది మృత్యువాత పడుతున్నారు. చదువుకు దూరమై 54 మిలియన్ మంది బాలలు వెట్టిచాకిరీతో పరుల ఇళ్లల్లో గడపవలసి వస్తోంది. అందుకనే ఈ అభాగ్యులను ఆదుకోడానికి నావంతు కృషి సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. యునిసెఫ్ సేవాకార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి. యునిసెఫ్ తరుపునే సేవాకార్యక్రమాలకు కాలేజీలో 2012లోవైస్‌ఛైర్మన్‌గా, 2013-14లో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాను. సేవాకార్యక్రమాలకు గుర్తింపుగానే యునిసెఫ్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబాబా అవార్డు అందుకోగలిగాను. 2014 మార్చి 2న అమెరికా లోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో దక్షిణాసియా అంతర్జాతీయ సుందరిగా విజయకిరీటం సాధించాను. జ్యుయెల్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ పేజియంట్ సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించాయి. ఈ అందాల పోటీలో భారత అంతర్జాతీయ అందాల సుందరి శ్రుతిధక్కర్, ఇండియన్ ప్రిన్సెస్ యుఎస్‌ఎ మాన్సీనంగానీ, మిస్ జ్యూయెల్ ఆఫ్ ఇండియా ప్రియాంకమోడీ తదితరులు పాల్గొన్నారు. పేజియంట్‌లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీయన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్ (ఎఎపిఐ) నుంచి అవార్డు వచ్చింది. ఫోరిడా లోని 2014 ఆగస్టు 1,2 తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ అందాల సుందరి అందాల పోటీల్లో పాల్గొన్న 50 మందిలో టాప్10లో ఎంపికయ్యాను. 2014లోనే పీపుల్స్ ఛాయిస్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా నాకు వచ్చిన నగదు మొత్తం బహుమతిని నా ధార్మిక సంస్థల కోసం అందించాను. దక్షిణాసియా అందాల సుందరిగా కీర్తి కిరీటం సాధించడం ఎంతో గొప్పకదా? అని అడగ్గా అందాల సుందరిగా సహజంగా ఎంపికయ్యాను తప్ప తాను ప్రత్యేకించి అందం కోసం చేసిన ప్రయత్నం ఏమీ లేదన్నారు. బాహ్యసౌందర్యం శాశ్వతం కాదని ఆత్మసౌందర్యం, సేవాధర్మం, జన్మను సార్ధకం చేస్తాయని ప్రత్యూష చెప్పారు. క్వీన్స్ కాలేజీలో సీనియర్ విద్యార్థి అయిన తాను కాలేజీ యూనిసెఫ్ అధ్యక్షురాలిగా ప్రస్తుతం సేవాకార్యక్రమాలు సాగిస్తున్నాను. స్థానిక సామాజిక సంస్థల నుంచి విరాళాలు సేకరించడంలో చొరవ చూపినందుకు రైజింగ్ స్టార్ అవార్డును యునిసెఫ్ నుంచి అందుకున్నాను. అమెరికా నిధి సేకరణ గ్లోబల్ అడ్వకేట్‌గా యునిసెఫ్ తరుఫున పనిచేస్తున్నాను. యుఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యం వహిస్తున్న సదస్సులో ప్రసంగించడానికి యునిసెఫ్ తరఫున ప్రసంగించడానికి ఎంపికైన వారిలో నేనొకరిని. ఆ సదస్సుకు రావలసిందిగా ఆహ్వానం అందింది. 2014సంవత్సరానికి సేవాకార్యక్రమాల నిర్వాహకులుగా అమెరికా మొత్తం మీద గుర్తింపు పొందిన 44 మంది వాలంటీర్లలో నేనూ ఉన్నాను. ఒబాబా వాలంటీర్ సర్వీస్ అవార్డు అందుకున్నాను. 2013లో ట్రిక్ అండ్ ట్రీట్ ఛాంపియన్ అవార్డు లభించింది. టిసిఎల్ ఎ సాంస్కృతిక నుంచి విశిష్ట నాయకత్వ అవార్డు వచ్చింది. అలాగే విశిష్ట సామాజిక సేవ చేసినందుకు, అందాల సుందరిగా కిరీటం సాధించినందుకు 2005 నాటి ప్రపంచ భారతీయ సుందరి సింధూర గడ్డె నన్ను సత్కరించింది. మీరు పిల్లల కోసం దక్షిణాఫ్రికాలో స్కూలు నిర్వహిస్తున్నారని విన్నా ం నిజమేనా ? అని ప్రశ్నించగా అవునని సమాధానం ఇచ్చారు. యునిసెఫ్ బృందం సేకరించిన నిధులతో ఘనా స్కూలు ప్రాజెక్టు చేపట్టాం. ఆ స్కూలు కు డైరక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఇంతటితో సరిపోదు. స్కూలు పిల్లలకు పూర్తిగా విద్యను అందించాలంటే మరెన్నో వనరులు సమకూరాలి. కంప్యూటర్లు కావాలి. ల్రైబ్రరీ కావాలి. వీటన్నిటికీ నిధులు సేకరిస్తున్నాం. చదువుకోడానికి ఏమాత్రం అవకాశం లేని పిల్లలకు అవకాశం కల్పించి అక్షర దానం చేస్తున్నాం. దాతలు అందించే విరాళాలే కాదు కార్లు శుభ్రం చేయడం, బ్రెడ్ అమ్మడం లాంటి ఎన్నో పనులు చేసి కూడా విరాళాలు పోగు చేస్తున్నాం. మా లక్ష్యం విద్యాసేవ. సేవాకార్యక్రమాలకు అంకితమైనందుకు అమెరికా లోని వివిధ సంస్థలు 12 అవార్డులు అందించాయి. అమెరికా లోని న్యూవరల్డు ట్రేడ్ సెంటర్ నిర్మాణం చేపట్టిన ఇండో అమెరికన్ ఇంజినీర్స్, ఆర్కిటెక్టు సొసైటీ నుంచి ముఖ్యఅతిధిగా వచ్చి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. భారత దేశంలో సేవాకార్యక్రమాలు చేపట్టే లక్ష్యం ఏమైనా నిర్ణయించుకున్నారా అని అడగ్గా పునెకు చెందిన బిఎమ్‌ఐటి ట్రస్ట్ ఛారిటీ ఆర్గనైజేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నన్ను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఈ సేవాసంస్థ 34 స్కూళ్ల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తోంది. అలాగే 4 ఆస్పత్రుల్లోని రోగులకు వైద్యసహాయం సమకూరుస్తోంది. మహిళలు వారంతటవారే జీవించగలిగేలా ఉపాధి సౌకర్యాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. తోడుంటేకాని అడుగు ముందుకెయ్యలేని కుంటివాళ్లకు చీకటే తప్ప వెలుగు తెలియని అంధులకు మాటలు రాని మూగ వాళ్లకు తాను పెద్దదిక్కుగా సాగాలన్నదే నాలక్ష్యం . ఇది ఒకదేశానికే పరిమితం కాదు. జగమంత కుటుంబం మనది. ఆ కుటుంబంలో నేను ఒక సేవకు రాలిని మాత్రమే -అని ఆమె తన మనసులోని ఆశయాలను వెల్లడించారు.