అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌,హెల్త్‌ కార్డులు

` అక్రిడేషన్‌ కార్డులపై విధివిధాలు రూపొందించాలి
` అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్‌(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్‌ కార్డులు అందేలా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో హోమ్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రవి గుప్తా, ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి, ఐపిఆర్‌ స్పెషల్‌ కవిూషనర్‌ సిహెచ్‌. ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్‌ తో కలిసి సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్‌ పాలసీ, జర్నలిస్ట్‌ల హెల్త్‌ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్‌ కమిటీ- తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటు-ందని, ఇందుకోసం హై పవర్‌ కమిటీ-ని కూడా పునరుద్దరించాలని నిర్ణయించినట్లు- వెల్లడిరచారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం జి.ఓ. జారీచేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. అలాగే, జర్నలిస్టుల జీత భత్యాలకు సంబంధించి తైప్రాక్షిక కమిటీ-ని కూడా పునరుద్దరిస్తున్నట్లు- తెలిపారు. జర్నలిస్టుల హెల్త్‌ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూరెన్స్‌ పాలసీలో ఏది జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందో అనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అక్రిడిటేషన్‌ పాలసీపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్‌ సైట్‌ ను తక్షణమే రూపొందించాలని అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్దరించాలని ప్రెస్‌ అకాడెవిూ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ సి.ఇ.ఓ. ఉదయ్‌ కుమార్‌, కార్మిక శాఖ అడిషనల్‌ కమిషనర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.