అర్హులైన ప్రతిఒక్కరికి ఆసరా పెన్షన్లు
-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి)
అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివ్రుద్ది, ఆర్ డబ్ల్యు.ఎస్. శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో సోమవారం కొత్తగా మంజూరైన పెన్షన్లను జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి ఫించనుదారులకు మంజూరు పత్రాలను, డిజిటల్ కార్డులను మంత్రి ఫించనుదారుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పనులను విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని పేద వర్గాలకు లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబందు,రైతు భీమ, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీముభారఖ్ పథకాలతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నదని మంత్రి తెలిపారు.రైతులకు ఉచిత విద్యత్ పంపిణీ వలన సంవత్సరానికి ఒక రైతుకు 80వేల నుండి లక్ష రూపాయల ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హాయంలో కేవలం రెండువందల రూపాయలు మాత్రమే పెన్షను పొందేవారని నేడు మూడువేల రూపాయల పెన్షన్ ను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన పేదలందరికి నూతనంగా ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు నిర్ణయించిన మేరకు ఆగష్టు 15 నుండి ఇట్టి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించుకున్నామని, దీనిలో భాగంగా వెలికట్టె గ్రామంలో ప్రస్తుతం ఉన్న 499 పెన్షన్లకు అదనంగా మరో 138 పెన్షన్లు మంజూరి అయినట్లు మంత్రి తెలిపారు. అర్హులై మిగిలి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందిస్తామన్నారు. దీనితో పాటు గ్రామంలో ఎస్సి కాలనీకు కోటీ 50 లక్షలతో రోడ్ల అభివృద్ధి పనులు చేపడ్తున్నామని స్వంత స్థలం కలిగిన వారికి ఇండ్లు కట్టుకునే పేదవారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయలను ఇవ్వనుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంభానికి చేరువయ్యే విధంగా ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 90 వేల 716 వందల పెన్షన్లను అదనంగా మరో 26 వేల 198 కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందని ఇట్టి పెన్షన్ల మంజూరికి గాను ప్రతినెల 27 కోట్ల 18 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పెన్షన్ దారులు వేలిముద్రల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండడానికి డిజిటల్ కార్డు అందిస్తున్నామని తద్వారా పెన్షన్ పొందవచ్చని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోసాని పుష్పలీల, జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ అంజయ్య, ఎంపీటీసీ మల్లమ్మ, ఆర్డీఒ ఎల్. రమేష్, డీఆర్డీఓ సన్యాసయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబందిత మండల, గ్రామ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు