అలకనంద ఆస్పత్రి ‘కిడ్నీ రాకెట్’
కేసు సీఐడీ చేతికి
` వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు
హైదరాబాద్(జనంసాక్షి): నగరంలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన ‘కిడ్నీ రాకెట్’ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆస్పత్రి ఛైర్మన్ సుమంత్, మరో వ్యక్తి గోపి సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్, గోపీని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.గతంలో కిడ్నీ రాకెట్ కేసులో మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి ద్వారా కొందరి పేర్లు, ఫోన్ నంబర్లు సేకరించారు. వీరంతా తమిళనాడు, కర్ణాటక నుంచి కిడ్నీ దాతలు, గ్రహీతల్ని తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అలకనంద ఆసుపత్రిలో కిడ్నీమార్పిడి శస్త్ర చికిత్సలు గతంలోనూ జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు కనీసం 15 నుంచి 20 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరమవుతారు. చికిత్స చేయడానికి వైద్యులతోపాటు ఆపరేషన్‌కు ముందు, తర్వాత ఐసీయూ, ఆపరేషన్ థియేటర్‌లో నర్సులు, టెక్నీషియన్లు ఉండాలి. ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఆసుపత్రి 9 పడకలతో ప్రారంభమైందని, ఇందులో ఎలాంటి ప్రత్యేక వసతులు లేవని రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు.