అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూత

హైదరాబాద్‌: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ‘మనదేశం‘ సినిమాతో ఎన్టీఆర్‌ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న జన్మించారు కృష్ణవేణి. తండ్రి యర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్‌. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి. ఆ తర్వాత వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్లినప్పుడు ఆయన ‘తులాభారం’ నాటకం చూశారు. అందులో కృష్ణవేణి నటన నచ్చి, సినిమాలో నటించమని అడి గారు. అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి.

ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1973) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు.

ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్‌ జయా పిక్చర్స్‌–శోభనాచల స్టూడియోస్‌ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్‌గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్‌ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి.