అవహేళన చేస్తే చూస్తూ కూర్చుంటారా?
తెలంగాణ ప్రాంత మంత్రులు ఒక్క రోజూ ప్రజల ఆకాంక్షను వ్యక్తపరచలేదు. ఇక్కడి ప్రజలంతా ఒకే గొంతుకతో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నా వారు వారి మనోభావాలకు కనీసం విలువనివ్వలేదు. ఆమాత్య పదవిని కాపాడుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రజల ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర పెట్టుబడిదారుల వద్ద తాకట్టుపెట్టి రాజకీయంగా జన్మనిచ్చిన ప్రజలకు, ఈ గడ్డకు తీరని ద్రోహం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు టీ జేఏసీ, టీఆర్‌ఎస్ ఉద్యమ పథాన సాగుతున్నాయి. తెలంగాణపై నెల రోజుల్లోగా తేల్చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం మాట తప్పడంతోనే జేఏసీ ఆధ్వర్యంలో సమరదీక్షకు కూర్చున్నారు. 36 గంటల పాటు సాగిన ఈ దీక్ష ముగింపు సందర్భంగా టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, నెహ్రూ కుటుంబాన్ని తూలనాడారని ముఖ్యమంత్రి ఆగ్రహం ఊగిపోయాడు. ఆ సమయంలో ఆయనకు అటు, ఇటు పక్కల తెలంగాణ ప్రాంత మంత్రులే కూర్చున్నారు. తెలంగాణ భాషను ముఖ్యమంత్రి అవహేళన చేస్తున్నా చేతగాని వాళ్లలా ఉత్సవ విగ్రహాల్ల కూర్చుండిపోయారు. కోదండరామ్, కేసీఆర్ మాత్రమే కాదు ఇంకే ఉద్యమకారుడైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలిపేందుకే అలా మాట్లాడారు తప్ప అవతలి వారిపై వారికి వ్యక్తిగత కక్ష లేదు. ఈర్షాద్వేశాలకు ఉద్యమంలో చోటు లేదు. అవతలివారు అడ్డుకునే శక్తులతో చేతులు కలిపి తమ గొంతు నులుముతున్నందునే వారు కాస్త గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేసిన ద్రోహాన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరమేమి లేదు. నెహ్రూ పుణ్యమా అనే భాషాప్రయోక్త రాష్ట్రాల పేరిట తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఆయన కుమార్తె, ఉక్కు మహిళగా తనకు తాను ప్రకటించుకున్న ఇందిరాగాంధీ 1969లో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని తుపాకీ గొట్టంతో అణచి వేసింది. 360 మందికి పైగా తెలంగాణ విద్యార్థులను కాల్చిచంపింది. 2004 నుంచి ఇప్పటి వరకూ ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ తెలంగాణకు ద్రోహం చేస్తూనే ఉంది. 2004లో తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని మోసం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరీ ద్రోహం చేసింది. బహిరంగ సభల్లో పలుమార్లు చెప్పి మాట తప్పింది. రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చి తర్వాత పట్టించుకోకుండా పోయింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి తర్వాత వెనక్కు తగ్గింది. ఆ తర్వాత సీమాంధ్ర నేతలు పేట్రిగి కాంగ్రెస్ అధినాయకత్వంలోని పెద్దలను మచ్చిక చేసుకొని తెలంగాణ రాకుండా అడ్డుపడుతుండటంతో చూసి తట్టుకోలేక వెయ్యి మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకునేందుకు కారణమైంది. నెల రోజుల్లోగా తేల్చేస్తామంటూ గత నెల 28 ప్రకటించి మళ్లీ మాట తప్పింది. దీనిని నిరసిస్తూనే ఉద్యమ నాయకులు నెహ్రూ కుటుంబంపై, కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యలు చేశారు. ఇదేదో పాపమన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలోని సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతుంటే వారికి వత్తాసు పలుకుతూ తెలంగాణ ప్రాంత మంత్రులు పక్కనే కూర్చున్నారు. వారంతా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టినవారే. ఇక్కడి ప్రజల ఓట్లతో గద్దెనెక్కి వారి ఆకాంక్షలను అవమానిస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడుతన్న వారితో అంటకాగుతూ తెలంగాణ విద్యార్థుల బలిదానాలకు కారకులవుతున్నారు. పదవుల కోసం పాకులాడుతూ పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారు. వారి అవహేళన మనస్థత్వం కొత్తదేమి కాదు. తెలుగు పేరుతో బలవంతంగా మనల్ని కలిపినప్పటి నుంచి తెలంగాణ భాష అవమానాలకు గురవుతూనే ఉంది. సినిమాల్లో, పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో తెలంగాణ భాష ప్రతినాయకుల భాషగానే నిలిచిపోయింది. అలాంటి వ్యక్తులతో కలిసి ఉద్యమ ద్రోహానికి పాల్పడుతున్న మంత్రులే తెలంగాణకు నిజమైన ద్రోహులు. వారి తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ మహోద్యమంలో వారు కొట్టుకుపోవడం ఖాయం. మంత్రులు సీమాంధ్ర పెట్టుబడిదారుల్లా కారుకూతలు మాని ఇప్పటికైనా స్వరాష్ట్ర ఉద్యమంలో కలిసి నడవాలి.