అవినీతి లేదు కాబట్టే.. 

రాష్ట్రానికి పెట్టుబడులు
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తిరుగులేని శక్తిగా అవతరించాం
– పెట్టుబడుల కోసమే విదేశాల పర్యటనలు
– కొందరు ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు
– ఇప్పటి వరకు రూ. 5.80 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి వచ్చాయి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
విజయవాడ, జులై11(జ‌నం సాక్షి) : ఏపీలో అవినీతి అక్రమాలకు తావులేకుండా పాలన సాగిస్తున్నామని, ఫలితంగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం విజయవాడలో చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సక్సెస్‌ అనేది ఓ కిక్‌’ అని ఈజ్‌ ఆఫ్‌ డ్యూయింగ్‌లో ఆంధప్రదేశ్‌ మొదటి ర్యాంకు సాధించడంపై చంద్రబాబు అభివర్ణించారు. సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి ర్యాంకు సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ సీఎం అభినందించారు. అవినీతి లేదు కాబట్టే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడిచన సీఎం.. పెట్టుబడిదారులు ఆంధప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టే విషయంలో సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పరిశ్రమల విషయంలో ఏపీ మైనస్‌లో ఉండేదని.. అలాంటిది ఇప్పుడు అగ్రభాగాన నిలపగలిగామన్నారు. పెట్టుబడిదారులపై వేధింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల విషయంలో ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలను ఏపీలో పాటిస్తున్నామని సీఎం అన్నారు. ప్రమోషన్‌, నెట్‌ వర్కింగ్‌, పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్తున్నామని… ఇప్పటివరకు 5.80 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాష్ఠాన్రికి వచ్చాయని సీఎం తెలిపారు. ఓ వైపు రాష్ట్రం పెట్టుబడుల విషయంలో దూసుకుపోతుంటే.. కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాము విదేశాలు తిరిగి పెట్టబడులు ఆహ్వానిస్తుంటే.. ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌(ఈవోడీ)లో తామే ఎప్పుడూ ముందుంటామని, ఇలాంటి ర్యాంకులు వచ్చినప్పుడే తాము చేస్తున్న కృషి తెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగిల్‌ విండో పద్ధతి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం అన్నారు. పారిశ్రామిక అనుమతులు సకాలంలో ఇస్తున్నామని, లోపాలను వెంటనే సరిద్దుకోవడం వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. సింగపూర్‌ పర్యటనపై కొంతమంది విమర్శలు చేస్తున్నారని, పారిశ్రామిక పెట్టుబడుల కోసమే సింగపూర్‌లో పర్యటించానని సీఎం వివరించారు. పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచామని తెలిపారు. అతిపెద్ద సంస్థ కియా మోటార్స్‌ ఏపీకి వచ్చిందని, జనవరిలో కియా మోటార్స్‌ మొదటికారు బయటకు వస్తుందని చెప్పారు. ఆటోమొబైల్‌ హబ్‌గా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.