అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతాం

రైతులు పథకాలు వినియోగించుకోవాలి
సీఎం కిరణ్‌
కర్నూలు, మే 11 (జనంసాక్షి) :
అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు బ్యాంకర్లు 7 లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా అందిస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలోని రైతులకు 70వేల కోట్ల రూపాయలను రుణాలుగా ఇస్తున్నాయన్నారు. ఒక సంవత్సరంలోగా అసలు చెల్లించండి వడ్డీ ప్రభుత్వమే కడుతుందన్నారు. రైతు తాను తీసుకునే రుణానికి 7శాతం వడ్డీ చెల్లించాల్సి ఉందన్నారు. అందులో మూడు శాతం వడ్డీని సోనియా నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మిగిలిన నాలుగు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. ఒకవేళ రుణాల విషయంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడితే ఆ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పౌల్ట్రీరంగంలో.. గుడ్డుపైన, చికెన్‌పైన పన్నును రద్దు చేశామన్నారు. అలాగే చేపలు, రొయ్యల పెంపకందార్లు ఇక నుంచి నాలా చార్జీలు చెల్లించనవసరం లేదన్నారు. కరువు వల్లో.. ఎండలకు పంటలు ఎండిపోతే.. వానల వల్ల పంటకు నష్టం వాటిల్లితే హెక్టారుకు 10వేల రూపాయలను ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తాను సీఎం పదవి చేపట్టకముందు హెక్టారుకు రూ.4,500 రూపాయలు ఇచ్చేవారన్నారు. తాను సీఎం అయిన తొలి నాలుగు రోజుల్లోనే ఆ మొత్తాన్ని 6వేల రూపాయలకు పెంచానన్నారు. ఇటీవల 10వేల రూపాయలు చేశామన్నారు. నేటి నుంచి జిల్లాలో ప్రారంభమైన రైతు సదస్సు ద్వారా పంటనష్టపరిహరం కింద రైతులకు 278 కోట్ల రూపాయలను అందించనున్నామని చెప్పారు. ట్రాక్టర్ల కోసం, నాట్లు వేసేందుకు, కోసేందుకుగాను 2,500 కోట్ల రూపాయలను ఇవ్వనున్నామన్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. టన్నుకు 1500 రూపాయలుగా ధర నిర్ణయించామన్నారు. అయితే ప్రభుత్వానికి ఒక్కరూ కూడా అమ్మలేదన్నారు. మిల్లర్లు పోటీ పడి టన్నుకు 1800, 1900 చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. కర్నూలులో తాగునీటి సమస్య పరిష్కారానికి గాను చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని మంత్రి టీజీ వెంకటేష్‌ కోరారన్నారు. శుక్రవారం సాయంత్రమే సంబంధిత ఫైలుపై సంతకం చేశానన్నారు. అంతేగాక ఆ పథకానికి 65 కోట్ల రూపాయలను మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు మరింత ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులకే చెందాలన్నది కూడా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరుతున్నానన్నారు. శాస్త్రవేత్తల, అధికారుల సలహా సూచనలు పాటించి మరింత ఆర్థికంగా లబ్ధి పొందాలని రైతులను కోరుతున్నానని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండ్రు మురళి, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.