అసెంబ్లీ ముట్టడితో కేంద్రం కదలాలి

‘బయ్యారం’ కోసం తెలంగాణంతా లొల్లి
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టే అసెంబ్లీ ముట్టడితో కేంద్రం కదిలిరావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన టీ జేఏసీ సమావే శంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే స్థాయి లో అసెంబ్లీ ముట్టడి నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. చలో అసెంబ్లీకి మొత్తం తెలంగాణలోని పది జిల్లాల ప్రజలను కదిలిస్తా మని తెలిపారు. అన్ని జిల్లాల్లో చలో అసెంబ్లీ సన్నాహక సమావే శాలు నిర్వహిస్తామని పేర్కొన్నా రు. బయ్యారం ఇనుప ఖనిజం కాపాడేందుకు

ప్రచార ఉద్యమం చేపడుతామన్నారు. బస్సు యాత్ర చేపట్టి బయ్యారంలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. బయ్యారంలోని ఖనిజం తరలింపునకు వ్యతిరేకంగా ఇతర పార్టీలు చేపట్టబోయే ఉద్యమానికి మద్దతు ఇస్తామని కోదండరామ్‌ అన్నారు. గతంలో కనీ వినీ రీతిలో చలో అసెంబ్లీ నిర్వహించి తెలంగాణ వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షలకు అడ్డుతగులుతున్న పెట్టుబడిదారులకు, వారికి వంతపాడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ వనరుల తరలింపును ఇక ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చలో అసెంబ్లీకి ప్రతి ఇంటి నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు.