అసోంను ముంచెత్తుతున్న వరదలు
న్యూఢిల్లీ, జూలై 1 : అస్సాంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 35కు చేరింది. నదీప్రవాహాలు తగ్గుముఖం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం కజారింగా జాతీయ పార్కులో వరదలలో చిక్కుకున్న ఏనుగును రక్షించబోయిన మావటిని ఏనుగు చంపేసింది. బ్రమ్మపుత్ర జలాల్లో పార్కు పూర్తిగా నీటమునిగింది. గోల్పారా జిల్లాలో గత రాత్రి పొద్దు పోయిన తరువాత ఇద్దరు మరణించారు. వారిలో ఏడాది పిల్లవాడున్నాడు. శనివారం ఉదయం ఒక టీనేజీ యువకుడు మరణించాడు. 22 జిల్లాల్లో 2084 గ్రామాల్లో సుమారు 11 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇంతవరకు 173 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. 43,400 హెక్టార్లలో పంట నీట మునిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరలో బాధిత ప్రాంతాలను దర్శించనున్నారు. మజులీలో విపత్తు యాజమాన్య బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జోర్హాట్ నుంచి వైద్య బృందాలు వారికి వైద్య సాయం అందించేందుకు బయలు దేరాయి. మిగతా ప్రపంచంలో ఈ ప్రాంతానికి సంబంధాలు తెగిపోయాయి. పడవ సర్వీసులను నిలుపుదల చేశారు. జోరహాట్‌లో వంద గ్రామాలకు పైగా జలమయమయ్యాయి. రాష్ట్ర మంత్రి అజంతా నియోగ్ ఈ ప్రాంతాలను సందర్శించారు. మధ్య అస్సాంలో బ్రహ్మపుత్ర ఉప నదులు లోకాంగ్ కపిలీ, కైలింగ్‌ల నీటి ప్రవాహం స్థిరంగా ఉంది. ఏ మాత్రం తగ్గు ముఖం పట్టలేదు. పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. బరాకీలోయలో లాఖిపూర్ తదితర గ్రామాల నుంచి 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.